పార్టీ నుంచి దూరమయ్యాకే సమస్యలు గుర్తుకొచ్చాయా అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నిరసన చేయాలంటే అనుమతులు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ బహిష్కత నేత , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పబ్లిసిటీ కోసమే కోటంరెడ్డి హంగామా చేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల నుంచి ఆయనకు ప్రజా సమస్యలు గుర్తుకురాలేదా అని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ నుంచి దూరమయ్యాకే సమస్యలు గుర్తుకు వచ్చాయా.. మరి అప్పుడెండుకు మాట్లాడలేదా అని కోటంరెడ్డి నిలదీశారు. సీఎంతో పాటు అధికారుల దృష్టికి అప్పుడే ఎందుకు తీసుకురాలేదన్నారు. నిరసన చేయాలంటే అనుమతులు తప్పనిసరని.. కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
ALso Read: ఎనిమిది గంటల జలదీక్ష: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్
ఇదిలావుండగా.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు గురువారంనాడు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలోని పొట్టిపాలెం కలుజు వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఎనిమిది గంటల పాటు జలదీక్షను చేయనున్నట్టుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఈ దీక్షకు వెళ్లకుండా ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తన నివాసం నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు అనుమతి లేదంటూ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా శ్రీధర్ రెడ్డి నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆయన తన నివాసం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. వంతెన నిర్మాణం కోసం తాను నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నట్టుగా శ్రీధర్ రెడ్డి చెప్పారు. పోలీసులు అడ్డుకున్నా సరే తాను దీక్షను కొనసాగిస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.
