సారాంశం
తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన మంత్రి జోగి రమేష్.. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతేనని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన మంత్రి జోగి రమేష్.. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతేనని విమర్శించారు. 14 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉండి చేయలేని అభివృద్దిని.. సీఎం జగన్ నాలుగేళ్లలో చేసి చూపించారని అన్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన 650 వాగ్దానాలలో 10 కూడా నెరవేర్చలేదని విమర్శించారు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబుది నకిలీ చరిత్ర అని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని స్థితిలో ఉన్నాడని విమర్శలు గుప్పించారు.
‘‘డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో..’’ అంటూ విమర్శలు గుప్పించిన జోగి రమేష్.. టీడీపీ మేనిఫెస్టోను చించేసి చెత్త బుట్టలో పడేశారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. 14 ఏళ్ళలో ఉచిత బస్సు ప్రయాణం ఎందుకివ్వలేదని అడిగారు.. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశాడు. 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబును బీసీలు తరిమితరిమి కొడతారని అన్నారు. పేదల రక్తాన్ని పీల్చిపిప్పిచేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబున వేషాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
చంద్రబాబు తన కేబినెట్‌లో ఒక్క బీసీకైనా ప్రాధాన్యత ఇచ్చారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ కేబినెట్‌లో సామాజిక న్యాయం చేశారని చెప్పారు. సీఎం జగన్ గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలం ఇస్తుంటే చంద్రబాబు కోర్టులకెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు పేదల ఆదాయం రెట్టింపు చేస్తానంటున్నాడని.. మేనిఫెస్టో అంటే బాధ్యత ఉండాలని పేర్కొన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయటానికే కృషి చేశారని అన్నారు.