జనాన్ని వదిలి హైదరాబాద్‌లోనా.. రాజకీయ సన్యాసం చేసినట్లే: బాబుపై మంత్రి జయరాం విమర్శలు
టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.
టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. ఆదివారం కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రతిపక్షనేత హైదరాబాద్‌లో ఉంటున్నారని విమర్శించారు.
ఐదు కోట్ల ఆంధ్రులను గాలికి వదిలేసి హైదరాబాద్‌లో కాలక్షేపం చేస్తున్నారని జయరాం మండిపడ్డారు. దీని బట్టి చూస్తే చంద్రబాబు ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
Also Read:ఆ లేఖపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం: నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తి విచారణ
ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. క్లిష్ట సమయంలో ప్రజలకు సహాయం చేయకుండా.. టీడీపీ నాయకులు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారని జయరాం దుయ్యబట్టారు.
కరోనా సోకుతుందన్న భయంతో చంద్రబాబు, లోకేశ్ ఇంటికే పరిమితమయ్యారని.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, రాబోయే ఎన్నికల్లో కేవలం సీట్లకే పరిమితమవుతుందని మంత్రి జోస్యం చెప్పారు.
కోట్ల సుజాతమ్మకు వైసీపీ ప్రభుత్వాన్ని, తమను విమర్శించే అర్హత లేదని జయరాం అన్నారు. వలస కూలీల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మిక శాఖ అన్ని విధాలుకుగా ఆదుకునే ఏర్పాట్లు చేస్తుంటే విమర్శలు చేయడం సరికాదన్నారు.
Also Read:ఏపీ పోలీసులకు రెండు రెట్లు ఎక్కువ జీతాలివ్వాలి: యరపతినేని డిమాండ్
ఫ్యాక్సన్ రాజకీయంతో ఎంతోమంది ఆడపడుచులను వితంతువులుగా మార్చిన ఘనత కోట్లు కుటుంబానికే దక్కుతుందని జయరాం విమర్శించారు. ఆలూరు ప్రజలు రెండు సార్లు చిత్తుగా ఓడించినా వారికి బుద్ధి రాలేదు.. మరోసారి కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని మంత్రి ధ్వజమెత్తారు.
మరోవైపు దేశంలో కరోనా పరీక్షలు అత్యధికంగా చేసిన రాష్ట్రం మనదేనని జయరాం గుర్తుచేశారు. వైరస్ కట్టడికి జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి ప్రశంసించారు.