175 నియోజకవర్గాల పేర్లు తెలుసా... ‘‘సీఎం పవన్ కల్యాణ్’’ పేరుతో సినిమా తీస్తే ప్రొడ్యూస్ చేస్తా : గుడివాడ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియదన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. సీఎం పవన్ కల్యాణ్ పేరుతో పవన్ సినిమా తీస్తే తానే ప్రొడక్షన్ చేస్తానని ఆయన సెటైర్లు వేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పవన్‌కు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియదన్నారు. సినిమాల్లో పవర్ స్టార్, పాలిటిక్సలో ప్యాకేజ్ స్టార్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి మహా ప్రస్థానం ఖాయమని అమర్‌నాథ్ జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఫ్యాన్స్ కలలు కంటున్నారని.. సీఎం పవన్ కల్యాణ్ పేరుతో సినిమా తీస్తే తానే ప్రొడక్షన్ చేస్తానని ఆయన సెటైర్లు వేశారు.
అటు మరో మంత్రి అంబటి రాంబాబు సైతం పవన్‌పై విమర్శలు గుప్పించారు. ముద్రగడ ఉద్యమాన్ని చంద్రబాబు అణిచి వేసినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నించారు. ముద్రగడను చంద్రబాబు ప్రభుత్వం వేధించినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. హరి రామజోగయ్య దీక్ష చేస్తేనే పవన్ స్పందించారని అంబటి చురకలంటించారు. టీడీపీ ప్రభుత్వంలో మాట్లాడని పవన్.. జగన్ సీఎంగా వున్నప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని రాంబాబు నిలదీశారు. పవన్ ఇప్పుడే మాట్లాడటం వెనుకున్న ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ALso Read: హరిరామజోగయ్యకు పవన్ కల్యాణ్ ఫోన్.. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్..
కాగా.. కాపు రిజర్వేషన్ల కోసం నేటి నుంచి నిరవధిక నిరహార దీక్ష చేయనున్నట్టుగా ప్రకటించిన మాజీ ఎంపీ హరిరామజోగయ్యను ఆదివారం అర్దరాత్రి బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ క్రమంలోనే హరిరామజోగయ్య ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనతో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. అలాగే వైద్యులతో మాట్లాడి హరిరామ జోగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హరిరామ జోగయ్య దీక్షపై ప్రభుత్వం స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం హరిరామ జోగయ్య 85 ఏళ్ల వయసులో అమరణ దీక్ష చేపట్టారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్చలు జరపాలని పవన్ కల్యాణ్ కోరారు.