పవన్ అజ్ఞాతవాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి అని సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ . టీడీపీ , జనసేనలు నగరంపై దుష్ప్రచారం చేస్తున్నాయని గుడివాడ మండిపడ్డారు.

టీడీపీ, జనసేనలపై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా వుండటం చంద్రబాబుకు ఇష్టం లేదని.. టీడీపీ , జనసేనలు నగరంపై దుష్ప్రచారం చేస్తున్నాయని గుడివాడ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని అని మంత్రి ఎద్దేవా చేశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, పవన్ అజ్ఞాతవాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి అని అమర్‌నాథ్ సెటైర్లు వేశారు. కొన్ని కంపెనీలకే భూములు కేటాయిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపోతే.. కాపు సామాజిక వర్గం ఓట్లు పడితే తప్పించి రాజకీయం చేయలేననే పరిస్ధితిలోకి చంద్రబాబు వెళ్లారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి చురకలంటించారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని, జగన్ వచ్చాక ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ వస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా లాంటి పరిస్ధితుల్లోనూ ప్రజల ఎకానమీ దెబ్బతినలేదని సజ్జల ప్రశంసించారు.

పార్టీలో చిన్న చిన్న అసంతృప్తులు వున్నా అధినేత మాటను ఎవ్వరూ కాదనరని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అనే శిథిలపార్టీని చంద్రబాబు ఏలుతున్నారని.. టీడీపీని, చంద్రబాబుని నడిపించేది ఎల్లో మీడియానే అని సజ్జల ఆరోపించారు. వై నాట్ 175 అనే లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామని... అసలు టీడీపీకి అభ్యర్ధులు వున్నారో లేదో కూడా తెలియని పరిస్ధితుల్లో టీడీపీ వుందని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. 

Also Read: వైసీపీలో మార్పులపై టీడీపీ - జనసేన నేతల వ్యాఖ్యలు .. ‘‘ ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి’’ అంటూ సజ్జల కౌంటర్

కాగా.. వైసీపీలో మార్పులపై నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ, జనసేనలు ముందు వాళ్ల ఇంటిని చక్కదిద్దుకోవాలని సజ్జల చురకలంటించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో, ఎక్కడ పోటీ చేయాలో ఆ రెండు పార్టీలకు ఇప్పటి వరకు స్పష్టత లేదని రామకృష్ణారెడ్డి అన్నారు. మార్పులు చేర్పులు అనేవి తమ పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను నారా లోకేష్ ఇమిటేడ్ చేస్తుంటారని.. లోకేష్ 3000 కిలోమీటర్ల పాదయాత్ర ఎక్కడ చేశాడో ఎవరికీ తెలియదని రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. 

నాయకుడిని మార్చితే కింద వున్న క్యాడర్ ఇబ్బందిపడటం సహజమని, అయితే ఎలా గెలవాలో..? గెలవాలంటే ఏం చేయాలనే స్ట్రాటజీ మాకుందని సజ్జల పేర్కొన్నారు. చిన్న చిన్న చికాకులను సరిదిద్దటం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు. 175కు 175 స్థానాల్లో వైసీపీ గెలవడం ఖాయమని.. బీసీల స్థానాల్లో చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు పోటీ చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. అందరినీ పిలిచి మాట్లాడతామని.. మా పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో తమకు తెలుసునని రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు.