విశాఖపట్టణం: తాను తెలుగుదేశం  పార్టీని వీడే ప్రసక్తే లేదని... అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకొంటానని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తేల్చి చెప్పారు. పార్టీ మారుతానని తనపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మకూడదని చెప్పారు.

ఆదివారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు.  తాను లోక్‌సభకు పోటీ చేయాలా.. అసెంబ్లీకి పోటీ చేయాలా అనే విషయాన్ని టీడీపీ అధిష్టానం నిర్ణయిస్తోందన్నారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. అవసరమైతే  రాజకీయాల నుండి తప్పుకొంటానని చెప్పారు.

బీసీ గర్జన పెట్టే అర్హత జగన్‌కు లేదన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వైసీపీ బీసీ నేతలను పార్టీ అధ్యక్షులను నియమించారా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ నిర్ణయిస్తే తాను పోటీకి కూడ దూరంగా ఉంటానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తరహాలోనే తాను దిగజారి మాట్లాడబోనని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఇతరుల గురించి మాట్లాడి తన ప్రతిష్టను దిగజార్చబోనని గంటా శ్రీనివాసరావు చెప్పారు.