బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌ పై జరిగిన రాళ్లదాడి ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలను గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు.ఆయన శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘ అమిత్‌ షాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాల్సి వస్తే ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా ఏపీ ప్రజలకు చెప్పాలి.
తిరుపతి ఘటన ప్రజల్లో ఉన్న ఆవేశంతో అనుకోకుండా జరిగింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు. నిన్ననే ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించి, తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టే ప్రజల్లో ఆవేశం ఇలాగే ఉంటుంది. అనవసర రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరు.’ అని అన్నారు. 

అమిత్ షా కాన్వాయిపై రాళ్ల దాడి జరిగడంపై చంద్రబాబు.. అమిత్ షాకి క్షమాపణలు చెప్పాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంటా పైవిధంగా స్పందించారు.