అమరావతి: రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీల పరిధిలోని భూముల విలువ త్వరలోనే పెంచడానికి శాస్త్రీయ బద్దంగా కసరత్తు పూర్తయింది. ఇందుకు సంబంధించి తుది నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డికి అందజేసేందుకు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవిన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సంబంధిత శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, కమిషనర్ సిద్ధార్థజైన్ లతో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. వాస్తవానికి ఈనెల ఒకటి నుంచి కొత్త విలువలు అమలవుతాయని భావించినప్పటికీ, ప్రజల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ తన వెబ్ సైట్ లో గత కొద్ది రోజులుగా వినతులు స్వీకరించింది. ఫలితంగా కొన్ని పట్టణాల్లో విలువలను సవరించడంలో ఆలస్యమైంది.  

read more   ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ నేతృత్వంలో కమిటీ

మూడు దశలలో పక్కాగా సమాచారం క్రోడీకరించి దాని ప్రకారంగా భూముల విలువలు, అందుకనుగుణంగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు కసరత్తు పూర్తయిందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ధరలను ఎంతవరకు పెంచాలన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు... వాటి పెంపు కనిష్టంగా ఐదు శాతం నుంచి ఉంటుందని చెప్పారు. 

మార్కెట్‌ విలువలను సవరించేందుకు ఇప్పటి వరకు వచ్చిన రెవెన్యూ, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌, ఆయా ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు  అధికారులు మంత్రి ధర్మాన కు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆమోదం లభించిన వెంటనే కొత్త మార్కెట్ విలువల ప్రకారమే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది.