విజయవాడ: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి‌పై మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ పాదయాత్ర ముగింపు సభలో అన్నీ అసత్యాలే మాట్లాడారని విరుచుకుపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమ వైసీపీ నేతలు అభద్రతా  భావంతో బతుకుతున్నారని విమర్శించారు. 

జగన్ పాదయాత్ర చేసిన అతనిలో పరిపక్వత కనిపించడం లేదని మండిపడ్డారు. ఇక జగన్‌ కాశీయాత్ర చేసుకోవడం ఉత్తమమని వ్యాఖ్యానించారు. కాశీ యాత్రకు ప్రధాని నరేంద్రమోదీ జగన్ కు తోడవుతారని ఎద్దేవా చేశారు. 

జగన్ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై జగన్‌ ఒక్క మాట అయినా మట్లాడారా అని నిలదీశారు. 

జగన్‌, కేసీఆర్‌, మోదీ కుమ్మక్కయ్యారని ముగ్గురూ కలిసి ఏపీకి అన్యాయం చెయ్యాలని చూస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రాయలసీమలో పరిశ్రమలు వస్తున్నాయని త్వరలో అభివృద్ధి చెందబోతున్న విషయం కూడా జగన్ కు తెలియడం లేదన్నారు. 
 
జగన్‌ అవినీతి బురదలో కూరుకుపోయారని విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్‌ ప్రసంగంలో నిరాశ, నిస్పృహ కనిపించిందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఎంతో అభివృద్ధి జరుగుతుంటే దానిని ఒప్పుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు. 

ఈనెలలో రూ.24వేల కోట్లు రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాలో జమ చేస్తామని దేవినేని చెప్పారు. వాస్తవాలు ఒప్పుకోకుండా అబద్ధాలు, అసత్యాలు చెబుతూ పాదయాత్ర చేస్తూ సమయం వృథా చేశారని విరుచుకుపడ్డారు. ఎలాగైనా అవినీతి సొమ్ముతో అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆ ప్రయత్నాలు నెరవేరవని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పుకొచ్చారు.