ఎందుకురా జోకులేసి చంపుతారు!: నారా భువనేశ్వరిపై అంబటి సెటైర్లు
చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాలతో మనస్థాపానికి గురయి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించడానికి సిద్దమయ్యారు. దీంతో ఆమెపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేసారు.
అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో టిడిపి శ్రేణులు, ఆయన అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమ అభిమాన నాయకుడిని జైల్లో పెట్టడం తట్టుకోలేక ఇప్పటికే చాలామంది చనిపోయినట్లు టిడిపి చెబుతోంది. ఇలా చంద్రబాబు కోసం చనిపోయిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. 'నిజం గెలవాలి' పేరిట బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు సిద్దమైన ఆమెపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేసారు.
''బాబు అరెస్టు వార్త విని మరణించారనడం -ఓ జోక్ !, మరణించినవారిని పరామర్శించడానికి వెళ్లడం -మరో జోక్ ! ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎందుకురా జోకులేసి చంపుతారు!'' అంటూ భువనేశ్వరి పరామర్శ పర్యటనపై ఎక్స్(ట్విట్టర్) వేదికన అంబటి రాంబాబు సెటైర్లు వేసారు.
ఇదిలావుంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న చంద్రబాబు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జైల్లోనే చంద్రబాబును చంపేందుకు వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన కుటుంబం, టిడిపి శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపైనా మంత్రి అంబటి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
Read More చంద్రబాబును కుటుంబమే బట్టలూడదీసి బజార్లో నిలబెడుతోంది..: సజ్జల రామకృష్ణారెడ్డి
ఎంత ప్రయత్నించినా చంద్రబాబుకు బెయిల్ రావడంలేదు... దీంతో ఆయన కుటుంబం అనారోగ్యం అంటూ కొత్త నాటకం ఆడుతోందని అంబటి అన్నారు. ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబు కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన భర్త కోసం నారా భువనేశ్వరి ప్రభుత్వంపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నామని... చంపాలని చూస్తున్నామంటూ ఆయన కుటుంబసభ్యులు, టీడిపి నాయకులు ఆరోపిస్తున్నారని అన్నారు. కానీ చంద్రబాబును చంపాల్సిన అవసరం తమకు లేదని... చట్టం తన పని తాను చేసుకుని పోతోందని అంబటి అన్నారు.