టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. ఇప్పటి వరకు చేసిన అన్యాయం చాలక, టీడీపీ అధినేత రాజధాని ప్రాంత రైతులను ఇంకా మభ్యపడుతున్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు మోసకారని, ఆయన మాటలు నమ్మవద్దని బొత్స రైతులకు సూచించారు. రాజధాని నిర్మాణం అంటే కొత్త పట్టణాల నిర్మాణం కాదని... రాజధాని రైతులు ఆందోళన చెందవద్దని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని బొత్స వెల్లడించారు.

Also Readజగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. అంగీకారమే: రాజధాని ప్రాంత వైసీపీ నేతలు

ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేయలేదని.. అన్ని జిల్లాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని బొత్స స్పష్టం చేశారు. వేల కోట్ల అప్పులను చంద్రబాబు లక్షల కోట్లకు మార్చారని, లక్షా 9 వేల కోట్ల అప్పు తెచ్చి కేవలం రూ. 5,800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని సత్యనారాయణ దుయ్యబట్టారు.

రేపు కేబినెట్‌లో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని బొత్స స్పష్టం చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు దోచుకున్నారు తప్ప.. ఏం చేయలేదని, రైతులను ఆయనలా తాము మోసం చేయమని బొత్స వెల్లడించారు.

Also Read:కాంగ్రెస్ తల్లిని చంపి పిల్లల్ని వేరుచేస్తే... వైసిపి ఆ పిల్లను కూడా...: మాజీ మంత్రులు

బాబుకు రాజధానిపై ప్రేమే ఉంటే.. ఇప్పటి వరకు ఇల్లు ఎందుకు కట్టుకోలేదని సత్తిబాబు ప్రశ్నించారు. 33 వేల ఎకరాలు ఏం చేస్తామో రాబోయే కాలంలో చూడాలని ఆయన సూచించారు.

రాజధాని వస్తుందని తెలిశాకే హెరిటేజ్ సంస్థ అమరావతిలో భూములు కొనుగోలు చేసిందని, మరి రెండేళ్ల ముందు ఎందుకు కొనలేదని బొత్స నిలదీశారు. అమరావతిలో కట్టిన భవనాలు వృథా పోవని మంత్రి స్పష్టం చేశారు.