తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని (tdp) చంద్రబాబు లాక్కొన్నారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... టీడీపీకి చంద్రబాబు కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చారని, అందుకే ఆ పార్టీ జవసత్వాలు కోల్పోయిందన్నారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారని బొత్స ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్, ఎయిర్‌పోర్ట్ నిర్మించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన గుర్తుచేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్‌పై ఎవరి పేరుందో ఒకసారి చూడాలంటూ బొత్స దుయ్యబట్టారు. జలయజ్ఞం కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నించారని మంత్రి ప్రశంసించారు.
అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ vijayasai reddy టిడిపి ఆవిర్భావ దినోత్సవంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఎవరో కన్నబిడ్డకు, ఇంకెవరో బర్త్ డే సెలబ్రేట్ చేసినంత దరిద్రంగా టిడిపి ఆవిర్భావ కార్యక్రమం ఉందని’ విమర్శలు గుప్పించారు. టీడీపీ chandrababu naidu పెట్టిన పార్టీ కాదని, NTR నుంచి దొంగతనంగా గుంజుకున్నదని ప్రజలందరికీ తెలుసన్నారు. ‘చంద్రబాబు కపట వేషాలు చూస్తూ పైన ఉన్న ఆ పెద్దాయన ఆత్మ ఎంతగా క్షోభిస్తోందో’.. అంటూ చురకలంటించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandrareddy) సైతం చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. చంద్రబాబు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఇంట్లో కూర్చుని ఏపిలో పాలనపై బురద జల్లుతున్నారని... విమర్శించే ముందు ఏపి ప్రజల మనోభావం తెలుసుకుంటే మంచిదన్నారు. టిడిపి నాయకులకు మాత్రమే ఇది సైకో పాలనలా కనిపిస్తుందని... కానీ చంద్రబాబు హయాంలోని 14ఏళ్లపాటు సైకో పాలన సాగిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ''వైసీపీ ప్రభుత్వాన్ని, సిఎం వైఎస్ జగన్ ని కించపరిచేందుకు మాత్రమే చంద్రబాబు రాష్ట్రంలో పాలనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలకు మంచి చెడుగా, చెడు మంచిగా కనిపిస్తుంటుంది'' అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.
'గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసిపి, వైఎస్ జగన్ పై నమ్మకంతో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపిలను గెలిపించారు. వారి నమ్మకమే నిజమై సంక్షేమ పాలన సాగుతుండటంతో వచ్చే ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. వైఎస్ జగన్ పాలన ప్రజల దృష్టిలో సంక్షేమ పాలన'' అని అన్నారు.
''డబ్బులతో ఎన్నికలకు వెళ్ళే సంస్కృతి టిడిపిదే... వైసిపిలో అలాంటి సంస్కృతి లేదు. చంద్రబాబు బినామీలు చందాలు వేసుకుని మరీ టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఎంత ప్రయత్నించినా వైసిపి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం'' అని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు.
''జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏ కుటుంబమూ ఆర్థికంగా చితికిపోకుండా ఆడుకుంటున్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచింది. ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకే వెళ్లేలా... ప్రతి పేషంట్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలా నాడు-నేడు పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్స్ ను భారీ నిధులతో కార్పోరేట్ స్థాయిలో ఆధునికరిస్తున్నాం'' అని మంత్రి తెలిపారు.
