చంద్రబాబు యుగపురుషుడిలా ఫీల్ అవుతున్నారు .. ఆ అక్రమాలు ఈనాడుకు కనిపించవా : బొత్స సత్యనారాయణ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారని.. రాజధాని విషయంలోనూ అవకతవకలు జరిగాయని మంత్రి ఆరోపించారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అనేక స్కామ్‌లు జరిగాయన్నారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారని బొత్స ఆరోపించారు. టిడ్కో గృహల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని.. దొరకకపోతే దొంగ లేకుంటే దొర అన్న రీతిలో బాబు పాలన వుందన్నారు.
బాబు పాపం పండి ఇప్పుడు జైలు పాలయ్యారని.. టీడీపీ నేతలు ఇప్పటికీ పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అమాయకులని టీడీపీ భావిస్తోందని ఆయన చురకలంటించారు. చంద్రబాబు చేసిన అక్రమాలు ఈనాడుకు కనిపించవా అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు నిజాయితీపరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని సత్యనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు తనను తాను యుగపురుషుడిలా ఫీల్ అవుతున్నారని.. అన్ని కోణాల్లోనూ ప్రభుత్వం విశ్లేషించిందని బొత్స చెప్పారు.
ALso Read: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఆరంభం మాత్రమే.. చంద్రబాబుపై ఎన్నో కేసులు : పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అన్ని వ్యవస్థలను చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని మంత్రి ఆరోపించారు. ఇవాళ్టీ బంద్ ఎలా జరిగిందో చూశామని.. చంద్రబాబు అవినీతిని న్యాయవ్యవస్థలు కూడా ధృవీకరిస్తున్నాయని బొత్స తెలిపారు. చంద్రబాబు ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారని.. రాజధాని విషయంలోనూ అవకతవకలు జరిగాయని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు చేసిన తప్పుకు అందరూ తలదించుకోవాల్సి వచ్చిందని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.