విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం పార్టీ చేస్తోన్న విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. బషీర్‌బాగ్‌లో కాల్పులు ఎవరి వల్ల జరిగాయంటూ బొత్స చురకలు వేశారు.  

ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై (electricity charges hike) ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) . గురువారం జగనన్న భూ హక్కు- భూ రక్ష పథకంపై (jagananna bhu hakku) సీఎం జగన్‌తో (ys jagan) సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీల పెంపుపై చంద్రబాబుకు ఏ మాత్రం మాట్లాడే అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపునకు, బషీర్ బాగ్‌లో కాల్పుల ఘటనకు చంద్రబాబుదే (chandrababu naidu) పేటెంట్ అని ఆయన విమర్శించారు. రైతులపై ఎవరి హయాంలో కాల్పులు జరిగాయో తెలియదా? అంటూ బొత్స ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు పెంచిన కారణంగానే బషీర్ బాగ్‌లో కాల్పులు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలు పెంచలేదా? అని ఆయన నిలదీశారు. 

తామేమైనా అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచితే అడగాలని చురకలు వేశారు. గత ప్రభుత్వంలో టారిఫ్ ఎంత, ఇప్పుడు టారిఫ్ ఎంత అని బొత్స ప్రశ్నించారు. డిస్కమ్ ల ఆదాయం, అప్పులు, నిర్వహణ వ్యయం... తదితర అంశాలపై విపక్షం సూచనలు ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయని, వాటిని పరిశీలించి, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

కాగా.. Andhra Pradesh లో power charges పెంచిన సంగతి తెలిసిందే. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 76-125 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.40 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 126-225 యూనిట్ కు రూ. 1.57 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. 

226 నుండి 400 యూనిట్లకు యూనిట్ కు రూ. 1.16 పెంచారు. 400 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారిపై రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. కేటగిరిలను రద్దు చేసి ఆరు స్లాబ్ లను తీసుకొచ్చినట్టుగా ఏపీ ఈఆర్‌సీ చైర్మెన్ ప్రకటించారు. 2016-17 లో యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 5.33 ఖర్చు అయిందని 2020-21 నాటికి యూనిట్ విద్యుత్ ఖర్చు రూ. 6.87కి పెరిగిందని ఈఆర్‌సీకి ఏపీ విద్యుత్ శాఖకు చెందిన డిస్కం కంపెనీలు వివరించాయి.

పెరిగిన విద్యుత్ ఖర్చుల మేరకు చార్జీల పెంపును అంగీకరించాలని డిస్కంలు ఈఆర్‌సీని కోరాయి. దీంతో డిస్కంలకు విద్యుత్ చార్జీలను పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చినట్టుగా ఈఆర్‌సీ చైర్మెన్ నాగార్జున రెడ్డి వివరించారు. ఇప్పటికే తెలంగాణలో కూడా విద్యుత్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. యూనిట్ కు 50 పైసల నుండి రూ. 2 ల వరకు చార్జీలను పెంచారు. విద్యుత్ ఛార్జీల పెంపును విపక్షాలు తీవ్రంగా తప్పు బడుతున్నాయి. 125 నుండి 225 యూనిట్ విద్యుత్ ను వినియోగించే వినియోగదారులు ఎక్కువగా రాష్ట్రంలో ఉంటారు. 

వీరిపై భారం మోపారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుతో రూ. 4,400 కోట్ల భారం వినియోగదారులపై పడనుంది. కోటి 70 లక్ష మందిపై విద్యత్ చార్జీల భారాన్ని డిస్కంలు మోపాయి..వివిధ కేటగిరిల కింద రూ. 1400 కోట్ల భారం పడనుంది. 75 యూనిట్ల లోపు వాడే వినియోగదారులు రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది ఉంటారు.మూడేళ్లలో ట్రూప్ అప్ చార్జీల పేరుతో రూ. 3 వేల కోట్ల వసూలుకు ఈఆర్సీ అనుమతిని ఇచ్చింది.2014 నుండి 2019 వరకు సర్ధుబాటు చార్జీల పేరుతో వసూళ్లు చేశాయి డిస్కం సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త టారీఫ్ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఆగష్టు నుండి ట్రూఆప్ చార్జీలను వసూలు చేయనున్నారు.