టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. అనంతపురంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇన్నాళ్లు ఆయన డబ్బు, మద్యంతోనే రాజకీయాలు చేశారని ఆరోపించారు.

రాజ్యాంగం, రాజకీయాల పట్ల జేసీకి ఏ మాత్రం విలువ లేదని బొత్స ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజుల నుంచి డబ్బు, మద్యం పంపిణీ చేసే గెలిచినట్లు కనిపిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు.

Also Read:స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు.. అడ్డుకుంది టీడీపీయే, ఇదే ఆధారం: బొత్స

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే ఎవరైనా పట్టుబడితే అనర్హత వేటు వేస్తామని సత్యనారాయణ హెచ్చరించారు.

చంద్రబాబు బీసీల ద్రోహి అని, టీడీపీ నేతలతో పిటిషన్లు వేయించి రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని బొత్స మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అడ్డుపడుతోందన్నారు.

నిధులు వృధా కాకుండా, అభివృద్ధికి ఆటంగకం లేకుండా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బ తీయాలని తెలుగుదేశం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. వెనుకబడిన, బలహీన వర్గాలంటే చంద్రబాబుకు చులకన అని అందుకే వారి రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు.

Also Read:అప్పుడో రకంగా.. ఇప్పుడో రకంగా, నోరా తాటిమట్టా: బాబుపై బొత్స వ్యాఖ్యలు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రజా నాయకులే గెలవాల్సిన అవసరం ఉందని సజ్జల స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని, ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి గెలిచేస్తామంటే ఎలా అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న నామినేటేడ్ పోస్టుల్లో 50 శాతం బీసీ వర్గాలకు కల్పించిన ఘనత జగన్‌దేనన్నారు.