స్కిల్ స్కామ్‌లో అధికారుల పాత్ర ఉంటే చర్యలు తప్పవు.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రభుత్వ అధికారుల పాత్ర ఉంటే చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రభుత్వ అధికారుల పాత్ర ఉంటే చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమకు ప్రేమ్‌చంద్రారెడ్డిపై ప్రత్యేక ప్రేమ లేదని చెప్పారు. అధికారులు అభ్యంతరం చెప్పాకనే ఫైల్ సీఎం దగ్గరకు వెళ్తుందని తెలిపారు. ఫైల్ అందుకున్న అప్పటి సీఎందే బాధ్యత అవుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లూ తప్పులు చేసినా దొరకలేదని అన్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు.
మరోవైపు జీపీఎస్‌పై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత పెన్షన్ విధానానికి కేంద్రం ఒప్పుకోవడం లేదని అన్నారు. సీపీఎస్ రద్దు అనేది ముగిసిన అధ్యాయమని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు మన చేతిలోలేని అంశమని పేర్కొన్నారు. సీపీఎస్ వల్ల అందరికీ నష్టమని.. జీపీఎస్ వల్ల మేలు జరుగుతుందని అన్నారు. జీపీఎస్ అందరికి ఆమోదయోగ్యం అని తాము చెప్పలేదని అన్నారు. సీపీఎస్ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని అందరినీ అభ్యర్దిస్తున్నానని కోరారు. జీపీఎస్‌లో ఇంకా ఏదైనా చెప్పదలుచుకుంటే చర్చిస్తామని చెప్పారు. సీపీఎస్ రద్దు ను ఎందుకు అంగీకరించడం లేదో బీజేపీ వాళ్ళను అడగాలని అన్నారు.