ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వికేంద్రీకరణే తమ లక్ష్యమన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సమయాన్ని బట్టి మూడు రాజధానుల బిల్లును తీసుకొస్తామంటూ మంత్రి బాంబు పేల్చారు.   

మూడు రాజధానులకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానులు (ap three capitals) తమ పార్టీ, ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. వికేంద్రీకరణకే తాము కట్టుబడి వున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సమయాన్ని బట్టి బిల్లు పెడతామని ఆయన స్పష్టం చేశారు. మొదటి నుంచి అదే చెబుతున్నామని.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే మా లక్ష్యమని బొత్స తెలిపారు. 

ఇక, అమరావతి విషయంలో హైకోర్టు (ap high court) కొద్దిరోజుల క్రితం కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ధర్మాసనం తెలిపింది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని తెలిపింది. 

హైకోర్టు తీర్పుపై అదేరోజు స్పందించిన బొత్స సత్యనారాయణ పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్నారు. రాజధాని అంటే భూములు, ఓ సామాజికవర్గం మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉండాలన్నారు. చంద్రబాబు మాదిరిగా వ్యక్తుల కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేయబోదని.. వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపడతామని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు. 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చెందేలా చూడ‌ట‌మే త‌మ ప్ర‌భుత్వ ధ్వేయ‌మ‌ని బొత్స పేర్కొన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌ధాని ఎక్క‌డ నిర్మించాల‌నే విష‌యంపై కేంద్రం నియ‌మించిన జ‌స్టిస్ శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ (sivaramakrishnan committee) కూడా పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌ను ప్ర‌స్తావించింద‌ని మంత్రి గుర్తుచేశారు. నాడు అధికారంలో ఉన్న టీడీపీ.. శివ‌రామ‌కృష్ణ‌న్ కమిటీ సిఫారుల‌ను ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని బొత్స సత్యనారాయణ ప్ర‌శ్నించారు. త‌మ పార్టీ అధినేత ఆలోచ‌న‌లే త‌మ‌కు శిరోధార్యం అని చెప్పిన ఆయన.. టీడీపీ (tdp) నేత‌లు చెప్పిన మాట‌ల‌ను తాము పెద్ద‌గా ప‌ట్టించుకోబోమ‌ని తేల్చేశారు.