జైల్లో చంద్రబాబు భద్రతపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
AP Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గత వారం తనను అరెస్టు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉండగా, ఆయన భద్రతకు సంబంధించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Minister Botsa Satyanarayana: చంద్రబాబుకు జైల్లో కల్పించే భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గత వారం తనను అరెస్టు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ కె.శ్రీనివాస్ రెడ్డి ధర్మాసనం ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలనీ, జ్యుడీషియల్ రిమాండ్ ను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉండగా, ఆయన భద్రతకు సంబంధించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు జైల్లో కల్పించే భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. చంద్రబాబు భద్రతలో ఏదైనా లోపం జరిగితే దానికి తాము పూర్తి బాధ్యత వహిస్తామని మంత్రి చెప్పారు. టీడీపీ అధినేత అరెస్టు విషయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కారును టార్గెట్ చేస్తూ ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న చంద్రబాబు తనపై వస్తున్న ఆరోపణలు, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రమేయం లేదని నిరూపించుకోవాలని పేర్కొన్నారు.
అలాగే, ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న మహిళా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మహిళా బిల్లుకు తాము అనుకూలంగా ఉన్నామనీ, విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహిలా రిజర్వేషన్ల బిల్లుకు తాము పూర్తిగా మద్దతు ఇస్తామని తెలిపారు. మహిళలకు కోసం తమ ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. దీనిలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం స్థానాలు తాము కేటాయించామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.