రాజధానిలో భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో కోవిడ్ ఆసుపత్రుల సహాయార్ధం ఆక్సిజన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.... ప్రతిపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగానే కౌలు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని బొత్స స్పష్టం చేశారు.

అమరావతి కౌలు రైతులకు పెన్షన్‌ను కూడా రూ.5 వేలకు పెంచాలనుకున్నట్లు పేర్కొన్నారు. కానీ కోర్టుకు వెళ్లడంతో సాధ్యపడలేదని... ఈ కారణంగానే కౌలు రూ.2,500 చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన చెప్పారు.

పేదవారికి లబ్ధి చేకూరుతున్న కార్యక్రమాలకు దయ చేసి ఎవరూ అడ్డుపడొద్దని ఈ సందర్భంగా బొత్స విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ఎంతటి వారైనా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.

రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో అధికారుల జాప్యం, సరైన సమాధానం చెప్పకపోవడంతో విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బుధవారం రైతులు యత్నించిన విషయం తెలిసిందే.

దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. రైతుల అరెస్ట్‌లను నిరసిస్తూ రాజకీయ, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.