Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి ప్రత్యేక హోదాకే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆదివారం నాడు ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు.

Minister Botsa Satyanarayana Key Comments on Special Status to AP
Author
Guntur, First Published Feb 13, 2022, 2:48 PM IST | Last Updated Feb 13, 2022, 2:48 PM IST


అమరావతి:ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఆదివారం నాడు మంత్రి Botsa Satyanarayana  అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసిన ప్రతిసారి విభజన చట్టంలోని అంశాలపై అడుగుతున్నామన్నారు. ప్రత్యేక హోదా అనేది  తమ ప్రభుత్వ విధానం అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

Visakhapatnam కు రాజధాని రావటం తథ్యం అని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పేశారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని ఇందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదన్నారు. ‘మూడు రాజధానుల నిర్ణయం మా విధానం. ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్నారు.  3 రాజధానుల బిల్లులో లోపాలు సవరించి కొత్త బిల్లుతో ముందుకొస్తామన్నారు. ప్రత్యేక హోదా విషయం విభజన చట్టంలో ఉందన్నారు. పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలకు సంబంధించి ఓ పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులతో విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 17న ఈ కమిటీ సమావేశం కానుంది. అయితే ఈ భేటీకి సంబంధించిన ఎజెండా విషయంలో కేంద్రం ఏపీకి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్నురాయితీలు అనే అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే ఎజెండాను పరిమితం చేసింది. 

ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల పెండింగ్ అంశాల పరిష్కారానికి శనివారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ  త్రీ మెన్ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యల మీద కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ  నిర్వహించనున్నారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ లతో కమిటి ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే ఈనెల 17న తొలి భేటీ కావాలని నిర్ణయించినట్లు రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఈనెల 8న పంపిన సమాచారంలో మధ్యాహ్నం 3.30గం.లకు భేటీ కావాలని నిర్ణయించినా... తరువాత భేటీ సమయాన్ని హోం శాఖ అధికారులు 11గం.లకు మార్చారు. ఈ త్రిసభ్య కమిటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ కానుంది. షెడ్యూల్‌ 9, 10లలో ఉన్న సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై కూడా చర్చించనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios