మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను వెనక్కి తీసుకురావడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను వెనక్కి తీసుకురావడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడంలో కొంచెం ఆలస్యం జరిగిందన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని.. ప్రతి ఒక్క విద్యార్ధిని వెనక్కి తీసుకొస్తామని బొత్స స్పష్టం చేశారు. ముందుగా 150 మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశామని సత్యనారాయణ తెలిపారు.
అంతకుముందు మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను రక్షించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలపై అక్రమ కేసులు పెట్టడంలో వున్న శ్రద్ధ విద్యార్ధులను కాపాడటంలో లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో వున్నా , అధికారంలో వున్నా తెలుగువారి సంక్షేమం కోసం టీడీపీ కృషి చేస్తూనే వుంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Also Read: మంచినీళ్లలో విషం, బాంబు దాడులు: మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులు
రంగులు వేసేందుకు, ప్రచారం చేసుకునేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. కానీ ఆపదలో వున్న విద్యార్ధులను ఆదుకోరా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరిగే జగన్.. విద్యార్ధుల కోసం ఒక ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. మణిపూర్‌లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన విద్యార్ధులను వెంటనే తీసుకురావాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
కాగా.. మణిపూర్ లో సుమారు 100 మంది విద్యార్ధులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. విద్యార్ధుల కోసం ప్రత్యేక విమానాలను పంపనుంది. అలాగే ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
