ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే డీఎస్సీ , విద్యాశాఖలోనూ పోస్టుల భర్తీకి : బొత్స సత్యనారాయణ
త్వరలోనే విద్యాశాఖలో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేస్తామని , డీఎస్సీ వేస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ . ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తామని.. వర్సిటీల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుభవార్త చెప్పారు. త్వరలోనే విద్యాశాఖలో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేస్తామని బొత్స వెల్లడించారు. యూనివర్సిటీలు, ఐఐఐటీల్లో ఖాళీగా వున్న 3,200కు పైగా పోస్టులను కొద్దిరోజుల్లో భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. గడిచిన 18 ఏళ్లుగా వర్సిటీల్లో పోస్టుల భర్తీ జరగలేదని బొత్స పేర్కొన్నారు.
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తామని.. వర్సిటీల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు. అలాగే త్వరలోనే డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని.. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని మంత్రి తెలిపారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ వుంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోపే డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని ఆయన సంకేతాలిచ్చారు.
మరోవైపు.. అమిత్ షాతో పురందేశ్వరి భేటీపై బొత్స సత్యనారాయణ స్పందించారు. ఏపీ బీజేపీ .. టీడీపీకి బీ టీమ్ అని ఆయన ఆరోపించారు. పురందేశ్వరి , లోకేష్ కలిసి వెళ్లారో, విడివిడిగా వెళ్లారోనంటూ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీకి చెప్పి చేయాల్సిన అవసరం మాకేముందని ఆయన ప్రశ్నించారు. అమిత్ షాను కలిసి వారిద్దరూ బాధలు చెప్పుకుని వుంటారని బొత్స వ్యాఖ్యానించారు.
అలాగే విద్యాశాఖపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అందించేది అంతా ఉచిత కంటెంటేనని తెలిపారు. బైజూస్‌కు తాము ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని బొత్స స్పష్టం చేశారు. ఆ సంస్థ ఇచ్చిన కంటెంట్‌తో 8వ తరగతి విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు 5 లక్షలకు పైగా ట్యాబ్స్ అందించామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో అందజేసే ట్యాబ్స్‌లో 8, 9, 10వ తరగతులకు సంబంధించిన కంటెంట్ వేసి ఇస్తామని మంత్రి వెల్లడించారు.