Asianet News TeluguAsianet News Telugu

అధికార వికేంద్రీకరణే మా విధానం.. న్యాయ సలహా తర్వాతే తదుపరి నిర్ణయం : హైకోర్టు తీర్పుపై బొత్స

ఏపీ మూడు రాజధానులు , సీఆర్‌డీయే రద్దుకు సంబంధించి ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పరిపాలనా వికేంద్రీకరణకు వందశాతం కట్టుబడి వున్నామని బొత్స స్పష్టం చేశారు. 

minister botsa satyanarayana comments on ap high court verdict on ap three capitals and amaravathi
Author
amaravathi, First Published Mar 3, 2022, 7:59 PM IST | Last Updated Mar 3, 2022, 7:59 PM IST

ఏపీ మూడు రాజధానులు (ap three capitals), సీఆర్‌డీయే రద్దుకు (crda) సంబంధించి హైకోర్టు (ap high court) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు (supreme court) వెళ్లాలా వద్దా అనేది ఆలోచిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) . అమరావతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానిదేనని బొత్స స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటామన్న ఆయన.. పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని సత్యనారాయణ చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణకు వందశాతం కట్టుబడి వున్నామని బొత్స స్పష్టం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ (sivaramakrishnan committee report) నివేదికను అప్పటి ప్రభుత్వం ఎందుకు పరిగణనలోనికి తీసుకోలేదని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఆర్‌డీయే చట్టాన్ని అమలు చేస్తున్నామన్న ఆయన.. హైకోర్టు అదే చెప్పిందని, తాము దానికి వ్యతిరేకం కాదని గుర్తుచేశారు. ఇది సమయం, ఖర్చు , నిధులతో ముడిపడి వుందని ఈ మూడు అంశాలను పరిగణనలోనికి తీసుకుంటామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో ఐదు కోట్లమందితో మాట్లాడుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సమాజం కోసం  కాకుండా సామాజిక వర్గం కోసం పనిచేశాడని బొత్స దుయ్యబట్టారు. భూములు ఇమ్మని హైకోర్టు చెప్పింది.. తాము ఇస్తున్నామని సత్యనారాయణ పేర్కొన్నారు. సీఎం ఎందుకు క్షమాపణ చెప్పాలని బొత్స ప్రశ్నించారు. ఏదైనా సమాజం కోసం చేయాలని.. సామాజిక వర్గం కోసం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలన్నారు.  ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 

ఇకపోతే, మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై తీర్పు వెలురించిన హైకోర్టు.. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని, 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలంది. అభివృద్ది పనులపై హైకోర్టుకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని పేర్కొంది. రాజధాని అవసరాలకే భూమిని వినియోగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమిని వినియోగించడానికి వీల్లేదని తెలిపింది. రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. 

కొందరు న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ది చేయాలని తెలిపింది. మాస్టర్ ప్లాన్ ఉన్నది ఉన్నట్టుగా కొనసాగించాలని చెప్పింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు పేర్కొంది. పిటిషన్ల ఖర్చు కోసం రూ. 50 వేలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ సీఎం జగన్‌ (ys jagan) సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమీక్షలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏజీ శ్రీరామ్‌, అదనపు ఏజీలు పాల్గొన్నారు. హైకోర్టు, తీర్పు, భవిష్యత్‌ కార్యాచరణపై వారి అభిప్రాయాలను జగన్ తెలుసుకున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios