Asianet News TeluguAsianet News Telugu

విద్య, వైద్యం, సంక్షేమానికే మా ప్రాధాన్యం : బడ్జెట్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్

విద్య, వైద్యం, సంక్షేమానికే మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు. 
 

minister botsa satyanarayana comments on ap budget 2023-24
Author
First Published Mar 16, 2023, 3:32 PM IST

ప్రభుత్వ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ అని.. ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ అన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇదన్నారు. వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలిపారు. విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని.. విద్యా రంగానికి 32 వేల కోట్లను ఈ బడ్జెట్ లో కేటాయించారని బొత్స సత్యనారాయణ తెలిపారు. 

ఎక్కడ విద్యాధికులు ఉంటారో ఆ రాష్ట్రం ఎంతో వృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో వనరులను సమకూర్చుకోవడం కోసం ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నామని.. సామాన్యుల కోసం సంక్షేమం అందించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామని బొత్స సత్యనారాయణ చెప్పారు. గత ఐదేళ్లలో ఎన్నో ఆకలి చావులు...ఆత్మహత్యలు చూశామని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో ప్రజలు సంతోషంగా ఉన్నారని బొత్స తెలిపారు. ఉద్యోగులతో పని చేయించుకున్నప్పుడు జీతాలివ్వాల్సిన బాధ్యత ఉంటుందన్న ఆయన .. ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులేనన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను బడ్జెట్ లో కలిపి చూపాము అనడం లో వాస్తవం లేదన్నారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అయితే బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో.. వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మంత్రి బుగ్గన తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లుగా, మూల ధన వ్యయం రూ. 31,061 కోట్లుగా, రెవెన్యూ లోటు రూ. 22,316 కోట్లుగా, ద్రవ్య లోటు రూ. 54,587 కోట్లుగా, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతంగా, ద్రవ్య లోటు 1.54 శాతంగా పేర్కొన్నారు.

ఏపీ బడ్జెట్ 2023-24లో కేటాయింపులు ఇలా.. 


ఆర్థిక శాఖకు రూ. 72,424 కోట్లు
డీబీటీ స్కీమ్‌లకు రూ. 54,228 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్దికి రూ. 15,873 కోట్లు
వ్యవసాయానికి రూ. 11, 589 కోట్లు
పశుసంవర్దక శాఖకు రూ. 1,787 కోట్లు 
పెన్షన్లకు రూ. 21,434 కోట్లు
సాంఘిక సంక్షేమానికి రూ. 14,511 కోట్లు
నీటి పారుదల రంగానికి రూ. 11,908 కోట్లు
బీసీ సంక్షేమం- రూ. 23,509 కోట్లు
పర్యావరణం- రూ. 685 కోట్లు
ఉన్నత విద్య- రూ. 2,065 కోట్లు
ఇంధన శాఖ- రూ. 6,546 కోట్లు
మాధ్యమిక విద్య- రూ. 29,691 కోట్లు
అగ్రవర్ణ పేదల సంక్షేమం- రూ. 11,085 కోట్లు
జీఏడీ- రూ. 1,418 కోట్లు
హోంశాఖ- రూ. 8, 206 కోట్లు
గృహ నిర్మాణ శాఖ- రూ. 6,292 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయాలు- రూ. 3, 858 కోట్లు
నీటిపారుదల రంగం- రూ. 11,908 కోట్లు
వైఎస్సార్ ఆసరా-రూ. 6,700 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం- రూ. 2, 602 కోట్లు
మౌలిక వసతులు, పెట్టుబడులు- రూ. 1295 కోట్లు
కార్మిక శాఖ- రూ. 796 కోట్లు
ఐటీ శాఖ- రూ. 215 కోట్లు
న్యాయశాఖ- రూ.1,058 కోట్లు 
అసెంబ్లీ, సెక్రటేరియట్‌- రూ. 111 కోట్లు
పట్టణాభివృద్ధి- రూ. 9, 381 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 2,240 కోట్లు 
ట్రాన్స్‌పోర్టు, ఆర్అండ్‌బీ- రూ. 9,118 కోట్లు
ఎస్సీ కార్పొరేషన్- రూ. 8,84 కోట్లు
ఎస్టీ కార్పొరేషన్- రూ. 2,428 కోట్లు
బీసీ కార్పొరేషన్- రూ. 22,715 కోట్లు
ఈబీసీ కార్పొరేషన్- రూ. 6,165 కోట్లు
కాపు కార్పొరేషన్ రూ. 4,887 కోట్లు
క్రిస్టియన్ కార్పొరేషన్ రూ. 115 కోట్లు
బ్రాహ్మణ కార్పోరేషన్- రూ. 346.78 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios