అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమన్నారు  మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అందుకే మూడు రాజధానులపై చట్టం చేశామని బొత్స వెల్లడించారు. చట్టం చేసినప్పటి నుంచే ఆ ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి తెలిపారు. ఏ రోజైనా, ఏ క్షణమైనా అది అమలు కావొచ్చని బొత్స వ్యాఖ్యానించారు. 

మరోవైపు సీఆర్‌డీఏ కేసులకు రాజధాని తరలింపునకు సంబంధం లేదని నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. బుధవారం నాడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. అతి త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తోందని చెప్పారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుండి పాలన సాగించనున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.సీఎం ఎక్కడి నుండైనా పాలన సాగించవచ్చన్నారు. గతంలో చంద్రబాబునాయుడు హైద్రాబాద్ నుండి పాలన సాగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అయితే విశాఖ నుండి ఎఫ్పుడు పాలన ప్రారంభం కానుందో స్పష్టమైన తేదీని చెప్పలేమన్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలింపునకు ఏర్పాట్లు జరుగుతాయని ఆయన తెలిపారు

Alo Read:సీఆర్‌డీఏ కేసులకు రాజధాని విశాఖకు తరలింపునకు సంబంధం లేదు: విజయసాయిరెడ్డి

కాగా, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత  మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, జ్యూడిషీయల్ రాజధానిగా కర్నూల్, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి కొనసాగుతోందని ఏపీ సీఎం జగన్ గతంలో ప్రకటించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విపక్షాలు వ్యతిరేకించాయి.  రాజధానుల అంశం రాష్ట్రాల  ఇష్టమని కేంద్రం కూడ తేల్చి చెప్పింది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ  రాజధాని గ్రామస్తులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.