చంద్రబాబు గెలిస్తే.. మధ్యవర్తులు మళ్లీ వస్తారు , దోపిడీ ఖాయం : బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు
చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే కోర్టు రిమాండ్ విధించిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. ధనవంతుడు - పేదవాడికి, దోపిడీకి - నిజాయితీకి మధ్య వార్ జరుగుతోందని సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ దోపిడీ పార్టీని రాకుండా చూడాలని ఆయన సూచించారు.

చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే కోర్టు రిమాండ్ విధించిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ ఉచిత విద్యుత్‌పై సంతకం చేసి నెరవేర్చారని, జగన్ నవరత్నాలను అమలు చేస్తామని చెప్పి నెరవేర్చారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలు ఐదు సంతకాలు చేశారని.. అందులో ఒకటి రైతు రుణమాఫీ అని దానిని ఇచ్చారా అని బొత్స ప్రశ్నించారు. తప్పు చేసిన జైలుకెళ్లిన వ్యక్తిని ఓ పుణ్య పురుషుడిగా కొన్ని ఛానెళ్లు, పత్రికలు చెబుతున్నాయని సత్యనారాయణ దుయ్యబట్టారు.
అధికారం ఇచ్చారని రెచ్చిపోకూడదని.. దోపిడీ చేయకూడదని ఆయన చురకలంటించారు. చంద్రబాబు వస్తే మళ్లీ మధ్యవర్తులు వస్తారని, మళ్లీ దోచుకుంటారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైద్యం ప్రజలకు చేరువ చేయాలనే ప్రతి జిల్లాకు ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని.. విజయనగరం జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చారని బొత్స తెలిపారు. నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. ధనవంతుడు - పేదవాడికి, దోపిడీకి - నిజాయితీకి మధ్య వార్ జరుగుతోందని సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ దోపిడీ పార్టీని రాకుండా చూడాలని ఆయన సూచించారు.
ఇకపోతే.. చంద్రబాబు నాయుడు, టీడీపీ పాలనను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. టీపీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు. అయితే, 2019 ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని ప్రకటించిన 99 శాతం హామీలను నెరవేర్చిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు అనుభవంతో ఆయనకు ప్రజలు పట్టం కట్టారని మంత్రి అన్నారు.
కానీ దీనిని మర్చిపోయి ప్రజల సంక్షేమ కోసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రుణాలను మాఫీ చేయకపోవడంతో ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి జరగడం లేదని టీడీపీ మద్దతు ఉన్న మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సంస్థలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రసక్తే లేదన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నదని తెలిపారు. ప్రతిపక్షాలు పెట్రోలు, డీజిల్ వంటి నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని ఆరోపిస్తున్నారు. వారి మద్దతు ఉన్న వీడియా సంస్థలు ఇదే ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ ధరలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయనేది గుర్తించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎత్తిచూపారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పాకిస్థాన్‌లో చిక్కుకున్న మత్స్యకారులను వెనక్కి తీసుకొచ్చినందుకు సీఎం జగన్‌ను కొనియాడారు.