ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం సభ ప్రారంభమైనప వెంటనే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతికి సభ నివాళులర్పిస్తూ.. సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత అనుభవజ్ఙుడు అవసరమనే ఉద్దేశ్యంతో చంద్రబాబుకు అవకాశం కల్పించారన్నారు. అయితే ఆయన దానిని ఏ మాత్రం సద్వినియోగ పరచకుండా తాను చెప్పిందే వేదమన్న విధంగా ప్రవర్తించారని అవంతి ఎద్దేవా చేశారు.

రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి సూచించారు. వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలను ప్రమాణ స్వీకారం కూడా జరగ్గముందే టీడీపీలోకి లాక్కొన్నారని గుర్తు చేశారు.

అయితే ప్రత్యేక హోదా కోసం ఐదుగురు సభ్యుల చేత రాజీనామా చేయించిన జగన్ ప్రత్యేకహోదా ఇంకా సజీవంగా ఉండటానికి సాయం చేశారని అవంతి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామా చేస్తానంటే బాబు వారించారని శ్రీనివాస్ తెలిపారు.

కానీ చంద్రబాబు మళ్లీ టర్న్ తీసుకుని ప్యాకేజ్ వేస్ట్.. హోదానే ముద్దు అన్నారని అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పెట్టిందే కాంగ్రెస్  విధానాలకు వ్యతిరేకంగానని కానీ.. చంద్రబాబు కాంగ్రెస్ నేతలకు వంగి వంగి సలాంలు చేశారని అవంతి ధ్వజమెత్తారు.

వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని ఆయన విమర్శించారు. పెద్ద అనుభవం, పెద్ద వయసు ఉండటం కాదని.. పెద్ద హృదయం కావాలంటూ టీడీపీకి చురకలు అంటించారు.

అమరావతి ఆపేస్తామన్నది కేవలం దుష్ప్రచారమని.. పోలవరాన్ని పరుగులు పెట్టించారని చెబుతున్న తెలుగుదేం మరీ.. ఆ ప్రాంతంలో ఎందుకు ఓడిపోయిందని అవంతి ప్రశ్నించారు.

గత ఐదేళ్ల చంద్రబాబు పాలనాలో ఎన్నో సామాజిక వర్గాలు అభద్రతా భావానికి లోనయ్యాయని.. అందువల్లే వైసీపీకి 151 స్థానాలు కట్టబెట్టారని శ్రీనివాస్ తెలిపారు. వైఎస్ జగన్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈపాటికే ప్రతిపక్షం మిగిలి ఉండేది కాదన్నారు.