విశాఖపట్టణం:  మొన్న అచ్చెన్నాయుడు, నిన్న కొల్లు రవీంద్ర, రేపు గంటా శ్రీనివాసరావు అరెస్ట్ కాక తప్పదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం నాడు విశాఖపట్టణంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నీ కుంభకోణాలే చోటు చేసుకొన్నాయని ఆయన ఆరోపించారు. 

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గజం కూడ దోపిడికి గురికాలేదని అవంతి గుర్తు చేశారు.విశాఖలో రూ. 400 కోట్ల విలువైన భూమిని అన్యాక్రాంతం కాకుండా చూసినట్టుగా ఆయన తెలిపారు. 

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గత ప్రభుత్వ హయంలో నిబంధనలకు విరుద్దంగా సైకిళ్లను కొనుగోలు చేశారని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసిన  మరునాడే మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. 

గత కొంతకాలంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారుతారని ఆయనపై చాలా కాలంగా ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు.

మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు మాత్రం భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చనే సంకేతాలు ఇచ్చినట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.