ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబుకు విదేశీ మోజు ఎక్కువని, మనలాంటి సాధారణ మనుషులంటే ఆయనకి పడదని కేవలం సూటు, బూటు వేసుకున్న వాళ్లంటేనే ఆయనకు ఇష్టమన్నారు.

ప్రతిపక్షనేతలో అభద్రతా భావం పెరిగిపోయిందని... ఆయన హయాంలోనే నిబంధనలకి విరుద్ధంగా ఎల్జీ పాలిమర్స్‌కి ఇష్టానుసారం అనుమతులిచ్చేశారని అవంతి ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగితే, ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు.

Also Read:ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్: ఇద్దరు లోకోపైలెట్లకు అస్వస్థత

కేంద్ర పర్యావరణ అనుమతులు లేకపోయినా ప్లాంట్ విస్తరణకి చంద్రబాబు అనుమతులు ఇవ్వలేదా..? సింహాచలం ఆలయ భూములని సైతం అక్రమంగా డీనోటిఫై చేసి ఎల్జీ పాలిమర్స్‌‌కు అప్పగించలేదా అని అవంతి నిలదీశారు.

టీడీపీ అధినేతకి తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎక్కడిదన్న ఆయన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలని ఎవరినీ నమ్మేవారు కాదని గుర్తుచేశారు. కానీ జగన్ మమ్మల్ని, అధికారులని నమ్మి బాధ్యతలు అప్పగించారని, అయితే బాబుకి తానొక్కడినే ప్రచారం పొందాలనే యావ ఎక్కువని అవంతి ఆరోపించారు.

తన హయాంలో జరిగిన ప్రమాదాలపై చంద్రబాబు ఎలా స్పందించారో ప్రజలకి తెలియదా.? ప్రజలు అమాయకులు కాదని, ఆయన తప్పుడు ఆరోపణలను గమనిస్తున్నారని శ్రీనివాస్ అన్నారు.

గ్యాస్ లీక్ ప్రమాదంపై సీఎం జగన్ స్పందించిన తీరును అందరూ అభినందిస్తుంటే బాబు ఓర్వలేక తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని... ఆయన నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అవంతి ఆరోపించారు.

Also Read:సోషల్‌మీడియాలో ఫేక్ అకౌంట్లపై ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చర్యలు తీసుకోగలిగితే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. వేగంగా స్పందించి ప్రమాద స్థాయిని తగ్గించగలిగామని... గంట ఆలస్యమైనా ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండేదన్నారు.

మంచి మనసుతో ఆలోచించే బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారని అవంతి ప్రశంసించారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు.