విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చెయ్యడానికి వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఆందోళనలో వున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు. కొందరు స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గవర్నర్ ఫార్మాట్ లో కాకుండా తన సొంత ఫార్మాట్ లో రాజీనామా చేశాడని అన్నారు.  

స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగేలా కేంద్రం నిర్ణయం తీసుకునేవరకు అందరం కలిసి పోరాడదామని అన్నారు.  స్టీల్ ప్లాంట్ విషయాన్ని రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని..  రాజకీయాలకు అతీతంగా పోరాడదామన్నారు. 

''విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఎంతో మంది ప్రాణత్యాగల ఫలితం. విశాఖ సెంటిమెంట్ ఈ స్టీల్ ప్లాంట్. ఈ ప్లాంట్ పై దాదాపు లక్ష మంది వరకు ఆధారపడి ఉన్నారు. అయితే ఈ ప్లాంట్ కి సొంత  గనులు లేకపోడం వల్లే నష్టాల్లోకి వెళ్లింది. ఈ విషయంపై సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు" అని వెల్లడించారు.

read more   స్టీల్‌ ప్లాంట్‌‌ రగడ: రంగంలోకి జగన్, ప్రైవేటీకరణ చేయొద్దంటూ మోడీకి లేఖ

''రాష్టం విభజన తరువాత స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఎవరినీ సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చెయ్యాలని తీసుకున్ననిర్ణయం సరికాదు. సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు అందరం  వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ కోసం మేము రాజీలేని పోరాటం చేస్తాం. ఈ మిషయం మీద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు, నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తాం'' అని అవంతి వెల్లడించారు. 

ఇక ఏపీ పంచాయితీ ఎన్నికలపై అవంతి స్పందిస్తూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సంతోష పెట్టాలనే ఎస్ఈసీ వైసీపీ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కరోన తక్కువ ఉన్న సమయంలో ఎలక్షన్స్ వాయిదా వేసి ఇప్పుడు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఎలక్షన్స్ లో వైసీపీ మంత్రులను, కీలక నేతలను  హౌస్ అరెస్ట్ లు చెయ్యమని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించడం దారుణమని మంత్రి అవంతి ఆరోపించారు.