విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు నిర్ణయించడంతో ఆంధ్రప్రదేశ్ రగిలిపోతోంది. ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలతో విశాఖ నగరం అట్టుడుకుతోంది. దీనికి తోడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పేరుతో తన పదవికి రాజీనామా చేసి వాతావరణాన్ని వేడెక్కించారు.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహకరణపై పునరాలోచన చేయాలని ఆయన ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.

ప్లాంట్‌ను బలోపపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలని జగన్ సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ద్వారా సుమారు 20 వేల మంది ప్రత్యక్షంగా, వేలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని జగన్ లేఖలో తెలిపారు.

ప్రజల పోరాట ఫలితంగానే స్టీల్ ప్లాంట్ వచ్చిందని.. ఉత్పత్తి ఖర్చు పెరగడం వల్లే ప్లాంట్‌కు కష్టాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ప్లాంట్ పరిధిలో రూ. లక్ష కోట్ల విలువైన 19,700 ఎకరాలు వున్నాయని చెప్పారు.

స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు లేకపోవడంతో నష్టాలు వస్తున్నాయని.. గతేడాది డిసెంబర్‌లో ప్లాంట్‌కు రూ.200 కోట్ల లాభం వచ్చిందని జగన్ గుర్తుచేశారు. వచ్చే రెండేళ్లు ఇదే పరిస్ధితి వుంటే ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్యాంకు రుణాల మొత్తాన్ని వాటా రూపంలోకి మారిస్తే ఊరట కలుగుతుందని.. వడ్డి రేట్లు కూడా తగ్గిస్తే ప్లాంట్‌ పరిస్ధితి కూడా బాగుంటుందన్నారు.