రాష్ట్రంలో టూరిజం హోటళ్లను తెరుస్తున్నట్లు  ప్రకటించారు మంత్రి అవంతి శ్రీనివాస్. అమరావతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఆగస్టు 15 నుంచి అన్ని ప్రాంతాల్లో బొట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పర్యాటక ప్రాంత ప్రదేశాలను మళ్లీ అందుబాటులోకి తెస్తామని అవంతి స్పష్టం చేశారు. అన్ని జిల్లా పర్యాటక ప్రాంతాల్లో వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతిస్తామని మంత్రి వెల్లడించారు.

టూరిస్ట్ బస్సులను కూడా వారం రోజుల్లో సిద్ధం చేస్తామని.. టెంపుల్ టూరిజంని బాగా అభివృద్ధి చేస్తామని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రసాద్ స్కీం ద్వారా సింహాచలం దేవస్థానం అభివృద్ధి చేస్తామన్నారు.

Also Read:కరోనా వైరస్ కట్టడి.. ఏపీలో కొత్త ఆంక్షలు

అలాగే మరో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని.. 4 క్రీడా వికాస కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రతిభ గల పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు.

గతేడాది రూ.3 కోట్లు పేద క్రీడాకారులకు అందించామని.. ఈ ఏడాది కూడా  రూ.3 కోట్లను ముఖ్యమంత్రి కేటాయించారని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే జిమ్‌లను ప్రారంభిస్తామని.. పీవీ సింధు అకాడమీకి విశాఖలో భూములు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు.