నిత్యం బిజీబిజీగా ఉండే రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు దసరా రోజు ఆటవిడుపుగా చేపలు పట్టారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని తన స్వగ్రామం దేవునల్తాడలో సముద్ర తీరంలో కుటుంబ సభ్యులతో రోజంతా గడిపారు. 

తోటి మత్స్యకారులు, సోదరుడు సీదిరి చిరంజీవి చేపల వేట సాగించే బోటుపై నడి సంద్రంలోకి వెళ్లారు. వల పట్టుకుని వృత్తిలో లీనమయ్యారు. 30 పనాల వరకు చేపలు చిక్కడంతో ఆయన ఆనందంతో ఎగిరి గంతేశారు. అనంతరం చేపలతో తీరానికి చేరుకున్న మంత్రి భావనపాడు తీరానికి సతీసమేతంగా వెళ్లి సముద్ర స్నానాలు చేశారు.  

ఆ తర్వాత చిన్న నాటి స్నేహితులతో ఉల్లాసంగా సేదతీరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలా రోజులకు మళ్లీ చేపల వేటకు వెళ్లాను. ప్రధానంగా ఆటవిడుపు. కుటుంబం, స్నేహితుల మధ్య సరదాగా గడపడంతో బాల్యం గుర్తుకు వచ్చిందన్నారు. 

భావనపాడు ఫిషింగ్‌ హార్బర్‌లో ఎన్ని రకాల బోట్‌లు ఉన్నాయి. ఫీడ్‌ బ్యాక్‌ ఎలా ఉంది అనేది పరిశీలించానని,. కొత్త రకమైన వలలు ఎన్ని వచ్చాయి. అ వలల పనితీరు ఎలా ఉందనేది తెలుసుకున్నానన్నారు. మత్స్యకారుల అవసరాలేంటి అనేదానిపై మత్స్యకారులతో మాట్లాడి, మత్స్యకారులకు ఉన్న పథకాల వివరించానన్నారు. మత్స్యకారులకు హార్బర్‌ అవసరం, ఇంజిన్లు సరఫరా చేయాల్సిన అవసరాన్ని నేరుగా పరిశీలించడం ఒక అవకాశంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.