అమ‌రావ‌తిలోనే ఏపీ రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని హైకోర్టు తీర్పు చెప్పిన నేప‌థ్యంలో మ‌రోమారు ఏపీ రాజ‌ధాని అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తీర్పుపై మంత్రి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానులపై మంత్రి అప్పలరాజు (seediri appalaraju) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిని వికేంద్రీకరించి విశాఖలో సెక్రటేరియెట్‌ కట్టిస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో ఉన్న అసెంబ్లీని కొనసాగించి, లెజిస్లేటివ్‌ కేపిటల్‌ చేస్తామని పేర్కొన్నారు. ఇక కర్నూల్‌లో హైకోర్టును కట్టి న్యాయ రాజధానిగా రాయలసీమను చేస్తామన్నారు మంత్రి అప్పలరాజు. ఇక అమరావతి రాజధాని కావాలని చంద్రబాబు కోర్టుకు వెళ్లారని... అది అమరావతి కాదని, కమ్మరావతి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల కోసం సీఎం జగన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని... వికేంద్రీకరణ.. మూడు రాజధానులే తమ లక్ష్యమన్నారు మంత్రి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయానికి మద్దతు పలకాలని... వికేంద్రీకరణ ముద్దు... కమ్మరావతి వద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పలరాజు. అమరావతి నిర్మాణానికి 53 వేల ఎకరాలు (ప్రభుత్వ భూమితో కలిపి) చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ చేశారని మంత్రి చెప్పారు. భూములిచ్చిన రైతులకు ప్రతి సంవత్సరం పరిహారం ఇవ్వాలట.. ఇది చంద్రబాబు స్కీమ్ కాదు స్కామ్ అంటూ అప్పలరాజు వ్యాఖ్యానించారు. 

ఇదిలావుండగా.. రాజధాని మార్చేందుకు కానీ, రెండు, మూడు రాజధానులుగా విభజించుటకు శాసనాధికారం లేదంటూ ఏపీ హైకోర్టు తీర్పుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు (dharmana prasada rao) . శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాల మధ్య అధికారాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఆయన శనివారం లేఖ రాశారు. రాజ్యాంగంలో డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ పేరుతో శాసన, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థల పరిధిని స్పష్టంగా పేర్కొన్నారని ప్రసాదరావు లేఖలో వివరించారు. శాసనాలను తయారు చేయడం, విధి విధానాలను రూపొందించడం శాసనసభ హక్కు అని.. దానిని కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. హైకోర్టు తీర్పులో శాసనసభ అధికారాలలోనూ, బాధ్యత నిర్వహణలోను న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్నట్టు అర్థమవుతోందని ధర్మాన అన్నారు. 

మరోవైపు.. అమరావతే రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించనున్నట్లు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి (srikanth reddy) తెలిపారు. రాజధాని అంశాన్ని చర్చించే విషయమై బీఏసీలో నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. రాజధాని మార్చడం, మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న దానిపై చర్చిస్తామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ హక్కులపై చర్చించాలని శాసన సభ్యులు కోరుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ధర్మాన లేఖఫైన బీఏసీలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సైతం.. సభకు చట్టాలు చేసే హక్కు లేదనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చట్టం చేయడం శాసనసభకు సంక్రమించిన హక్కు అని ధర్మాన చెప్పారు. అసెంబ్లీ, న్యాయ, కార్యనిర్వహక బాధ్యతలపై చర్చ జరగాల్సిన అవసరం వుందని ఆయన వెల్లడించారు. 

ఇకపోతే.. అమ‌రావ‌తిలోనే (amaravathi) ఏపీ రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని హైకోర్టు (ap high court) తీర్పు చెప్పిన నేప‌థ్యంలో మ‌రోమారు ఏపీ రాజ‌ధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ (botsa satyanarayana) . శ‌నివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. త‌మ ప్ర‌భుత్వ వైఖ‌రిని మరోమారు తేల్చిచెప్పారు. ఇప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉందన్నారు. పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌తో (ap three capitals) రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చెందేలా చూడ‌ట‌మే త‌మ ప్ర‌భుత్వ ధ్వేయ‌మ‌ని బొత్స పేర్కొన్నారు.