దేవాలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ స్పష్టంగా వివరణ ఇచ్చారని తెలిపారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక్కసారిగా అందరూ బెంబేలెత్తారు... గుంపులు, గుంపులుగా ఏదేదో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీ హస్తం ఉందనే నిజం ఎక్కడ బయటపడుతుందో అనే భయం వారిలో కనిపించిందని అనిల్  కుమార్ ఆరోపించారు. విగ్రహాలు పగులగొట్టినా పర్లేదు కానీ నిజాలు బయటకు రాకూడదని వారి ఆలోచన.. ఇలా చేస్తే ఎవరికి లాభం అన్నది అందరికీ అర్థం అయ్యిందని మంత్రి ధ్వజమెత్తారు.

ఇవన్నీ దురుద్దేశాలతో రాజకీయాల కోసం చేసినవిగా కనిపిస్తున్నాయన్న మంత్రి.. వైఎస్ జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు పొందుతుంది 70 శాతం హిందువులు కాదని గుర్తుచేశారు. వీరు గంగలో మునిగినా...యాగాలు చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలని, బూట్లేసుకుని పూజలు చేసే వ్యక్తి ఎవరో రాష్ట్రం అందరికీ తెలుసునంటూ బాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు.

అమరావతిలో అమరేశ్వరుడి బొమ్మ ఎందుకు కనిపించదన్న ఆయన... కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు ఒక్కడికే తెలుసునంటూ దుయ్యబట్టారు. అన్ని కేసుల్లో మీ పాత్ర ఉందని చెప్పలేదు కదా...కొన్నింటిలో మీ పాత్ర ఉందని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

మేము కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా అంటూ మంత్రి ప్రశ్నించారు. అఖిలప్రియ కేసులో స్పందనే లేదు.. కానీ ఈ 9 కేసుల పై మాట్లాడుతున్నారని అనిల్ కుమార్ చురకలంటించారు.

9 కేసుల్లో ఉన్న వారు మీవారు కాదా...? గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పగలరా అంటూ మంత్రి నిలదీశారు. పలు సంఘటనల్లో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం టీడీపీ వారిది కాదా అని ప్రశ్నించారు.

రాజమండ్రి వినాయక విగ్రహానికి అపవిత్రం చేశారన్న కేసులో వున్నది బుచ్చియ్య చౌదరి అనుచరులు కాదా..? అని అనిల్ కుమార్ నిలదీశారు. తిత్లీ తుఫానులో విగ్రహం దెబ్బ తినడాన్ని ఓ బీజేపీ నేత దుష్ప్రచారం చేశారని.. దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేసిన నీచ చరిత్ర నీకుందంటూ మంత్రి ఎద్దేవా చేశారు.

విగ్రహాలు పగలగొట్టొచ్చు కానీ వాస్తవాలు బయటకు వస్తుంటే నారా వారి నరాల్లో వణుకు పుడుతోందని అనిల్ కుమార్ సెటైర్లు వేశారు. మతసమరస్యాన్ని చెడగొట్టి లబ్ది పొందాలనే నీచ, నికృష్ట ఆలోచన చంద్రబాబుకే ఉందని మంత్రి ఆరోపించారు.

ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అని చెప్పి మా పై దాడి చేసే పరిస్థితి వచ్చిందని.. భగవంతుడితో ఆడుకున్న వారు ఎవరూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదని అనిల్ కుమార్ హితవు పలికారు. కనీసం ఈ రోజుకైనా ఆ టీడీపీ వారిని సస్పెండ్ చేశారా, కరోనాలో ఎన్నో సంఘటనలు జరిగినా బయటకు రాలేదని మంత్రి ఆరోపించారు.

కానీ రాముని విగ్రహము అనగానే పరిగెత్తుకొచ్చాడని.. కచ్చితంగా దీని వెనుక ఎదో కుట్ర దాగుందని అది చంద్రబాబుకి ముందే తెలుసునని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆయనికి ఆయన సొంత వర్గం తప్ప ఎవరిమీదా ప్రేమ లేదని మండిపడ్డారు.