టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.  2009 తర్వాత ఇంత భారీ స్థాయిలో రాష్ట్రంలో వరదలు రావడం ఇప్పుడేనని ఆయన అన్నారు. గరిష్టంగా 8.05 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి వదిలినట్లు ఆయన పేర్కొన్నారు. 

ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ సరైన సమయంలోనే వరద నీటిని దిగువకు వదిలిపెట్టినట్లు ఆయన చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం గురించి కూడా ప్రస్తావన తీసుకువచ్చారు.  చంద్రబాబు ఉంటున్న ఇంటిని ముంచాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. వరదపై టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాయలసీమకు నీరువ్వడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని స్పష్టం చేశారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం మాత్రమే తమ బాధ్యత కాదని.. క్షేత్ర  స్థాయిలో ప్రజల బాగోగులను పంచుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. 

వరదలు భారీగా వచ్చినప్పుడు కొన్ని పొలాలు, ఇళ్లు మునగడం సర్వసాధారణమని చెప్పారు.  అధికారులు వారి పని వారు చేశారని... తాము జోక్యం చేసుకోలేమని చెప్పారు. ప్రాజెక్టుల నుంచి నీటిని వదిలినప్పుడు అధికారులు కొన్ని లెక్కలు పాటిస్తారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన వివరించారు.