రెచ్చగొడితే మర్యాదగా వుండదు... జాగ్రత్త..: టిడిపి సభ్యులకు అంబటి వార్నింగ్
రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా టిడిపి ఎమ్మెల్యేలకు మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. సభా సాంప్రదాయాలు పాటించుకుంటూ తాముకూడా రెచ్చిపోవాల్సి వస్తుందంటూ మంత్రి హెచ్చరించారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లో రెండో రోజయిన ఇవాళ కూడా టిడిపి ఎమ్మెల్యేల ఆందోళనలతో సభ సజావుగా సాగలేదు. సభ ప్రారంభంకాగానే స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న టిడిపి ఎమ్మెల్యేలు పెద్దపెట్టున ప్రభుత్వానికి, వైసిపికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అంతేకాదు పేపర్లు చించి స్పీకర్ పై విసిరేయడం, విజిల్స్ వేయడం చేసారు. వారికి స్పీకర్ సర్దిచెప్పినా వినిపించుకోకపోవడంతో ఈరోజు సభా కార్యక్రమాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేసారు. టిడిపి సభ్యుల సస్పెన్షన్ పై స్పీకర్ తమ్మినేని ప్రకటన చేసారు.
అంతకుముందు సభలో నిరసన తెలుపుతున్న టిడిపి సభ్యులకు మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. సభా మర్యాదలు పాటించుండా స్పీకర్ ను అవమానించేలా వ్యవహరించడం తగదని... పేపర్లు చించి ఆయనపై వేయడం ఏమిటంటూ మండిపడ్డారు. సభను అవమానిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తమను రెచ్చగొడుతున్నారని... ఇలాగైతే తాముకూడా సభా సాంప్రదాయాలను పక్కనపెట్టాల్సి వస్తుందన్నారు. ఆ పరిస్థితిని తీసుకురావద్దని మంత్రి హెచ్చరించారు.
Also Read కలియుగ కురుక్షేత్రంలో జగన్ అభినవ అర్జునుడు...పవన్ ది శల్యుడి పాత్ర : పేర్ని నాని
సభలో వుండటం ఇష్టంలేకుంటే బయటకు వెళ్లిపోవాలి... అంతేగానీ ఇలా ఇష్టమొచ్చినట్లు చేస్తామంటూ ఊరుకోమని అన్నారు. మర్యాదగా సభలోంచి బయటకు వెళతారా లేక సస్పెండ్ చేయమంటారా? అయినా వినకుండా మార్షల్స్ తో నెట్టించుకుంటారా? ఏదయినా మీ చాయిస్ అని సూచించారు. మేము రెచ్చిపోకముందే సభలోంచి బయటకు వెళ్లిపోవాలని టిడిపి ఎమ్మెల్యేలకు అంబటి వార్నింగ్ ఇచ్చారు.