ఆధారాలు లేకుండా కోర్టులు నిర్ణయాలు తీసుకోవు.. పవన్‌కు ఇంగితజ్ఞానం లేదు: మంత్రి అంబటి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును చట్టబద్దంగా సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును చట్టబద్దంగా సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సుప్రీం కోర్టు లాయర్ వచ్చి 10 గంటలు కోర్టులో కూర్చొని వాదనలు వినిపించిన.. అందులో పట్టు లేదని న్యాయమూర్తి కొట్టేశారని అన్నారు. హైకోర్టులో, సుప్రీం కోర్టులో ఏం జరుగుతుందనేది వేరే విషయమని చెప్పారు. తాడేపల్లిలో ఈరోజు మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనల తర్వాత ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని భావించి చంద్రబాబు రిమాండ్‌కు ఇవ్వడం జరిగిందని.. ఆ తర్వాత రాజమండ్రి జైలుకు తరలించారని చెప్పారు.
ఒక పొలిటిషన్ అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం బాధకరమైన అంశం అని అన్నారు. అయితే పొలిటికల్ జీవితం ఎలాంటిది అనేది కూడా చాడాల్సి ఉందని చెప్పారు. జగన్ కక్షపూరితంగా చంద్రబాబును జైలుకు పంపించారని టీడీపీ అనుకూల మీడియా సంస్థలు, పార్టీ నేతలు బలం ప్రయత్నం చేస్తున్నాయని.. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. అయితే మన ప్రజాస్వామ్య దేశంలో అన్యాయంగా, ఆధారాలు లేకుండా కోర్టులు ఏ నిర్ణయాలు తీసుకోవనే అంశాన్ని కూడా వారంతా గమనించాలని కోరారు.
చంద్రబాబును జైలుకు పంపి ఆనంద పడాల్సిన అవసరం ఎవరికి లేదని అన్నారు. చంద్రబాబు జీవితంలో ఏ విధంగా అన్యాయం చేశాడు, మోసాలు చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు అనేది చిన్నపిల్లవాడిని అడిగిన తెలుస్తోందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలకు పాల్పడిన బోన్ ఎక్కకుండా వ్యవస్థలను మేనేజ్ చేశాడనే మాట చాలా కాలంగా వినిపిస్తుందేనని అన్నారు. అయితే ఆయన దురదృష్టం కొద్ది, రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్ది.. ఆ మేనేజ్‌మెంట్‌కు రోజులు చెల్లాయని అన్నారు. వాస్తవాలను గమనించే వ్యవస్థలు రాబోతున్నాయని చెప్పారు.
9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటీ నుంచి డ్రామాలు సాగుతున్నాయని మండిపడ్డారు. సానుభూతి పొందాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్‌లో తీసుకోస్తామని అధికారులు చెబితే.. అందుకు ఆయన అంగీకరించలేదని అన్నారు. చంద్రబాబు రోడ్డు మార్గంలో వస్తుంటే జనసమీకరణ చేయాలని టీడీపీ చూసిందని.. కానీ అది కుదరలేదని, ఒక్కరు కూడా వచ్చి అడ్డుపడలేదని చెప్పారు.
చంద్రబాబు తప్పు చేయలేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించలేదని అన్నారు. టెక్నికల్ విషయాలపైనే చంద్రబాబు న్యాయవాదులు మాట్లాడారని అన్నారు. చంద్రబాబే స్వయంగా ఆయన వాదనలు వినిపించారని.. కానీ నిర్దోషి అని కూడా చెప్పుకోలేకుండా పోయాడని అన్నారు. బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి కనకే చంద్రబాబును జైలుకు పంపించాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు.
చంద్రబాబుకు నేరాలు చేయడం కొత్త కాదని.. చేసిన నేరాన్ని గుర్తించడమే కొత్త అయిందని అన్నారు. డబ్బు ఉంటే చాలు దేనినైనా కొనొచ్చని భావించే వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎమ్మెల్సీని కొనుగోలు చేసేందుకు సంబంధించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబే డైరెక్ట్‌గా ఫోన్ మాట్లాడారని విమర్శించారు. ఎన్నికలు ఖరీదైనవిగా మారేందుకు కారణం చంద్రబాబేనని ఆరోపించారు.
చంద్రబాబు చేసిన స్కామ్‌లు అనేకం ఉన్నాయని.. అమరావతి అనేది పెద్ద కుంభకోణమనేది తాము ముందునుంచి చెబుతూనే ఉన్నామని అన్నారు. అందులో కూడా వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. వంద సార్లు మోసం చేయొచ్చని.. ఎక్కడో ఒక చోట మోసగాడు దొరికిపోక తప్పదని.. అదే చంద్రబాబు విషయంలో జరిగిందని వమర్శించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ అని.. చంద్రబాబు అక్కడ భూములు కొని చేసిన అక్రమాలు మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
టీడీపీ ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చిందని.. కోర్టు రిమాండ్ విధించడంపై బంద్‌కు పిలుపునిస్తున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ నిరసనలకు ఎవరూ రావడం లేదని అచ్చెన్నాయుడు అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకు ఎవరూ బయటకు రావడం లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను గద్దె దించినప్పటీ.. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిపోయిందని.. ఇదంతా చంద్రబాబు అవినీతితోనే జరిగిందని ఆరోపించారు.
పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియవని, అనర్హుడని, ఇంగిత జ్ఞానం లేని వ్యక్తినని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీడీపీ బంద్‌కు పవన్ ఎందుకు మద్దతు తెలపుతున్నారని.. తాము చెబుతున్నట్టుగా ప్యాకేజ్ తీసుకున్నారనేది నిజమే కదా అని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే పవన్ ఎందుకు ఎగిరిపడుతున్నారని ప్రశ్నించారు. ముద్రగడ్డ పద్మనాభంపై అరాచకానికి పాల్పడినప్పుడు.. పవన్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. పవన్ తొలుత ఆయన పార్టీని బతికించుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి కేసులకు పవన్ సపోర్ట్ చేస్తున్నాడంటేనే ఆయనకు కూడా అందులో వాటా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. శాంతిభ్రదతలకు విఘాతం చేసే చర్యలకు పాల్పడితే ఈ ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.
కోనసీమ జిల్లాలో రాయలసీమ నుంచి 2వేల మందిని దించి 50 మందిని చంపేందుకు ప్లాన్ చేశారని చెబుతున్నారని.. రాయలసీమ అంటే రౌడీలేనా? అని ప్రశ్నించారు. పవన్ తీరును జనసైనికులు, ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.