Asianet News TeluguAsianet News Telugu

మా పక్కనే కూర్చొని, మాతోనే వుంటూ టీడీపీకి ఓటు.. పుట్టగతులుండవ్ : ‘ఆ నలుగురు’పై మంత్రి రాంబాబు ఫైర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన వ్యవహారంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆ నలుగురికి అసలు పుట్టగతులు వుండవని, డబ్బుకు ఆశపడ్డ వీళ్లు పశువుల్లాంటి వాళ్లంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

minister ambati rambabu serious comments on four mlas who suspended from ysrcp
Author
First Published Mar 24, 2023, 9:23 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇకపై ఆ నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ నలుగురూ ఎమ్మెల్యేలతో ముందే బేరసారాలు కుదుర్చుకుని తెలుగుదేశం పార్టీ తన అబ్యర్ధిని నిలబెట్టిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను, మనుషులను సంతలో కొనుగోలు చేసినట్లు కొన్నారని.. గతంలో తెలంగాణలోనూ ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారంటూ రాంబాబు ఎద్దేవా చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను కొని ఒక ఎమ్మెల్సీని గెలిపించుకుంటే.. అది వ్యూహం ఎలా అవుతుందని మంత్రి నిలదీశారు. 

ఎమ్మెల్యేలు సంతలో వస్తువుల్లా అమ్ముడుపోయారని రాంబాబు దుయ్యబట్టారు. ప్రలోభాలకు గురై పార్టీకి ద్రోహం చేసినవాళ్లు.. రేపు బయటకు వచ్చి లబోదిబోమంటారని మంత్రి జోస్యం చెప్పారు. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు క్షమించడానికి అర్హులు కాదని.. సస్పెండ్ చేయడానికి ప్రోసీజర్ కావాలా అని కోటంరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కి 175 స్థానాల్లో గెలిచి తీరుతుందన్నారు. జగన్ వ్యాన్ ఎక్కి ప్రజల్లోకి వెళితే.. ఉప్పెనలా వస్తారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. టికెట్లు ఇవ్వడం కుదరదని చెప్పడం వల్లే ఈ నలుగురు బయటకు వెళ్లారని మంత్రి ఆరోపించారు. మాతో పక్కనే కూర్చొని, మాతోనే వుంటూ టీడీపీకి ఓటు వేయడం మోసం కాదా అని రాంబాబు నిలదీశారు. ఆ నలుగురికి అసలు పుట్టగతులు వుండవని, డబ్బుకు ఆశపడ్డ వీళ్లు పశువుల్లాంటి వాళ్లంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత మొదలైందంటున్న చంద్రబాబుకు దత్తపుత్రుడు అవసరం లేదని ఒంటరిగా రావాలని రాంబాబు సవాల్ విసిరారు. 

ALso REad: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ .. నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు, ఒక్కొక్కరికి రూ.15 కోట్లు : సజ్జల

కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన షాక్‌కి గింగిరాలు తిరుగుతున్న వైసీపీకి .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు శరాఘాతంలా తగిలాయి. సభలో బలం వుండటంతో పాటు విపక్ష పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల మద్ధతుతు ఏడు స్థానాలు తన ఖాతాలో పడతాయని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహంతో షాకిచ్చారు. దీనికి తోడు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై చర్చ జరగుతోంది. 

ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వైసీపీ నుంచి ఈ నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. 

వైసీపీ ప్రధాన కార్యదర్శి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కొక్క ఎమ్మెల్యేకి చంద్రబాబు రూ.15 నుంచి రూ.20 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. క్రాస్ ఓటింగ్‌పై అంతర్గతంగా విచారణ చేపట్టామని సజ్జల తెలిపారు. ఈ క్రమంలో ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని.. అలాగే క్రాస్ ఓటింగ్ చేసినవాళ్లకు టికెట్ ఇస్తామని కూడా టీడీపీ చెప్పి వుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దర్యాప్తు తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు వేశామని సజ్జల స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios