చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
సత్తెనపల్లి : టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అసలు రాజకీయాలకే పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్... రాజకీయాల కోసం ఏదయినా చేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబుకు రాజకీయ లబ్ది చూకూర్చేందుకే పవన్ పార్టీ పెట్టాడని... ఆయన నాయకుడు కాదు కూలీ నెంబర్ 1 అంటూ అంబటి ఎద్దేవా చేసారు.
పవన్ కల్యాణ్, జనసేన పార్టీ రోజురోజుకు మరగుజ్జులా మారిపోతుందని అంబటి అన్నారు. పవన్ పెరగడు... ఇతరులను పెరగనివ్వడని అన్నారు. రాజకీయ పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పవన్ నోట్లో వేలు పెట్టుకుని చంద్రబాబు చేయి పట్టుకునే తిరుగుతున్నాడని అన్నారు. 2014 లో చంద్రబాబుకు మద్దతిచ్చిన పవన్ ఇప్పటివరకు రాజకీయంగా పెరిగిందేమీ లేదన్నారు. పవన్ రాజకీయంగా మరగుజ్జుగా మారిపోయాడని అంబటి అన్నారు.
జనసేన ప్రచారం కోసం పవన్ కల్యాణ్ తయారుచేయించుకున్న వారాహి వాహనం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కదులుతుందని అంబటి అన్నారు. ఆడవాళ్లు బంగారు వడ్డాణం చేయించుకున్నట్లు పవన్ వారాహి వాహనం చేయించుకుని దాచుకున్నాడని ఎద్దేవా చేసాడు. దళిత ద్రోహి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతివ్వడం దురదృష్టకరమని... వీరిని నమ్మినవారు సర్వనాశనం అవుతారని అంబటి మండిపడ్డారు.
Read More ఆర్ 5 జోన్‌లో మోడరన్ టౌన్‌లు: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
చంద్రబాబు సత్తెనపల్లి పర్యటనలో భాగంగా కంటెపూడి గ్రామంలో దివ్యాంగూరాలిని పరామర్శించడం... ట్రై సైకిల్, లక్ష రూపాయలు ప్రకటించడమూ రాజకీయమేనని అంబటి అన్నారు. జనాలు లేకపోవడంతో కాస్త ఆలస్యంగా వెళ్ళడానికే దివ్యాంగురాలిని పరామర్శిస్తున్నట్లు నాటకం ఆడారన్నారు. చంద్రబాబు హామీలు, బూటకపు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
ప్రభుత్వంపై బురద జల్లే వాళ్లకు చంద్రబాబు సాయం చేస్తున్నాడని... అందుకే సత్తెనపల్లి పలువురు బాధితులకు సాయం డ్రామా ఆడారన్నారు. బాధిత కుటుంబాలకు మాయమాటలు చెప్పి మోసం చేశాడన్నారు. దళితులపై చంద్రబాబుకు ప్రేమలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
