వాలంటీర్స్ అంటే క్రిమినల్స్, దోపిడీదారులా.... నోరు జాగ్రత్త : చంద్రబాబుపై మంత్రి అంబటి ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. వాలంటీర్లు తప్పు చేస్తే ఉపేక్షిస్తామా అని ప్రశ్నించారు. ఇవే చివరి ఎన్నికలని బాబు మనసులో మాట బయటపెట్టారని అంబటి సెటైర్లు వేశారు.

వాలంటీర్స్, క్రిమినల్స్ దోపిడీదారులు కాదన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లు తప్పు చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. చంద్రబాబు నోరు పెట్టుకుని మాట్లాడాలని.. వాలంటీర్లపై టీడీపీ విషం చిమ్ముతోందన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్లా అని అంబటి జోస్యం చెప్పారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోచుకున్నారని .. ఇవే చివరి ఎన్నికలని బాబు మనసులో మాట బయటపెట్టారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
సీట్లకు 175 సీట్లతో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఐటీ వచ్చిందా అని రాంబాబు ప్రశ్నించారు. ఇవే చివరి ఎన్నికలని బాబు మనసులో మాట బయటపెట్టారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు.. నోరు జారావంటే జాగ్రత్త అని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్ధితి లేదని.. పవన్ కల్యాణ్ వారాహి పేరుతో ఆర్భాటం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో అని.. రాజకీయాల్లో జీరో అని అంబటి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ మబ్బులు వచ్చాక వాతావరణం చూద్దాం అని సెటైర్లు వేశారు.
అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులపై నోరెత్తని వైఎస్సార్సీపీ.. మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కంటే వైఎస్ జగన్ పాలన వల్లనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని విమర్శించారు. పోలవరం పూర్తి కాకుండా అడ్డుకుందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలు, జగన్ వైఖరి రాష్ట్ర వినాశనానికి దారితీసిందని చంద్రబాబు ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్న చంద్రబాబు నాయుడు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గద్దె దించాలంటూ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తామని మాజీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు ప్రజలకు ఫోన్ చేసి జగన్ ను గద్దె దించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.