Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారు.. వ‌చ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గద్దె దించాలంటూ చంద్రబాబు పిలుపు

Vijayawada: ఏపీ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులపై నోరెత్తని వైఎస్సార్సీపీ.. మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితమ‌ని పేర్కొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర విభజన కంటే వైఎస్ జగన్ పాలన వల్లనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు.
 

YSRCP that destroyed Andhra Pradesh: Chandrababu calls to oust YSRCP in next elections
Author
First Published Dec 11, 2022, 3:11 AM IST

TDP Chief Nara Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లా కడప ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి,  వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులపై నోరెత్తని వైఎస్సార్సీపీ.. మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితమ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కంటే వైఎస్ జగన్ పాలన వల్లనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని విమ‌ర్శించారు. పోలవరం పూర్తి కాకుండా అడ్డుకుంద‌ని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలు, జగన్ వైఖరి రాష్ట్ర వినాశనానికి దారితీసిందని చంద్ర‌బాబు ఆరోపించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీకి త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని పేర్కొన్న చంద్ర‌బాబు నాయుడు..  వ‌చ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గద్దె దించాలంటూ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తామని మాజీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు ప్రజలకు ఫోన్ చేసి జగన్ ను గద్దె దించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 

‘‘ఏపీలో అన్నదాతల ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకరం. వ్యవసాయ రంగ వృద్దిలో, ఆక్వా ఎగుమతుల్లో నాడు రికార్డులు సృష్టించిన రాష్ట్రం... ఇప్పుడు మూడేళ్లలో 1,673 రైతు ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్ గా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు రైతులను అప్పులపాలు చేస్తున్నాయి" అని పేర్కొన్నారు. 

 

"మద్దతు ధర లేకపోవడం, వ్యవసాయ సబ్సిడీలు నిలిచిపోవడం వంటివి అన్నదాతల బలవన్మరణాలకు  కారణం అవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ టెర్రరిజం తీరుతో ప్రజలపై వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి. దీంతో నిస్పృహకు గురైన సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలతో ప్రజలు నిరాశా నిస్పృహలతో  ఉంటే.. వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టకుండా, తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా ప్రకటనలు చేస్తోంది. రెండు రాష్ట్రాలు కలవాలి, కలపాలి అంటూ ప్రజలను గందరగోళంలోకి నెడుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తోంది" అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios