మీ మరిది హయాంలో జరిగినవి గుర్తులేవా?.. పురందేశ్వరికి మంత్రి అమర్నాథ్ కౌంటర్..
మీ మరిది హయాంలో చేసిన అప్పుల సంగతేంటి.. వాటి గురించి మాట్లాడరా? అంటూ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి కౌంటర్ ఇచ్చారు మంత్రిగుడివాడ అమర్నాథ్.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై బీజేపీ నూతన అధ్యక్షురాలు పురందేశ్వరికి అవగాహన లేదా అని? మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తాజాగా చేసిన వ్యాఖ్యలపై గుడివాడ అమర్నాథ్ ఈ మేరకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందన్నారు.
వారికి నిధులు ఎంత అవసరమో అంతవరకే ప్రభుత్వం ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని చెప్పారు. ప్రజలకు తాము జవాబుదారీగా ఉంటామని పేర్కొన్నారు. అప్పులు చేసినా.. అది ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్నారు. పురందేశ్వరి అంతకుముందు ఈ రాష్ట్రాన్ని తన మరిది పరిపాలించాడు అన్న విషయాన్ని మరిచిపోతున్నారని… మరిది చంద్రబాబు హయాంలోనూ రాష్ట్రం అప్పులు చేసిందని గుర్తు చేశారు.
జగన్ ప్రభుత్వం రూ. 7.14 లక్షల కోట్ల అప్పు చేసింది.. త్వరలోనే పవన్‌తో భేటీ అవుతా: పురందేశ్వరి
ఆ సమయంలో ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద కూడా బిజెపి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇలాగే మాట్లాడితే బాగుంటుందని చురకలాంటించారు. టిడిపి హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగం మీద పురందేశ్వరికి తెలియదా? దీనిపై ఆమె మాట్లాడరా? అంటూ నిలదీశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైనప్పటినుంచి పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంమీద విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే పురందేశ్వరి ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార వైసీపీ భారీగా అప్పులు చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులు సమకూర్చిందన్నారు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ దిశలో రాష్ట్రం ముందుకు సాగాలని ప్రజలు కలలు కన్నారన్నారు. కానీ, ప్రస్తుతం అంధకార ఆంధ్రప్రదేశ్‌గా, అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా, అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందని.. ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 7.14 లక్షల కోట్ల మేర అప్పు చేసిందని అన్నారు. రాబోయే కాలంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం చూపి రూ. 8, 300 కోట్లు తెచ్చారని విమర్శించారు.