అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ కేసుల కోసం ప్రధాని నరేంద్రమోదీతోనూ దోచుకున్న ఆస్తుల కోసం కేసీఆర్ తోనూ లాలూచీ పడ్డారంటూ కీలక ఆరోపణలు చేశారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో వైఎస్ జగన్ పప్పులుడకవన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జగన్, కేటీఆర్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలే జగన్ ని కేటీఆర్ కలిశారని చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ ఇస్తానంటున్నాడని ఏ గిఫ్ట్ ఇస్తాడో చూస్తామంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో జగన్ పార్టీని ఎత్తేశాడని, కేసీఆర్ కి సపోర్ట్ చేశారంటూ ఆరోపించారు. త్వరలో జగన్ కు ఏపీ ప్రజలు గుణపాఠం చెప్తారని తెలిపారు. ఏపీలో అభివృద్ధి జరుగుతుంటే ఏం జరుగుతుందని ప్రశ్నిస్తావా అని మండిపడ్డారు. 

అమరావతి నిర్మాణం జరుగుతుంటే ఎక్కడ జరుగుతుందా అని అంటున్నారని, పోలవరం ప్రాజెక్టు 64 శాతం పనులు పూర్తి చేసుకుంటే అక్కడా ఏమీ జరగలేదని ఆరోపిస్తున్నారని ఇవేం మాటలు జగన్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి ఏపీలో పప్పులు ఉడకవన్న మంత్రి మేడా మల్లికార్జునరెడ్డి ఏం పొడుస్తారంటూ మండిపడ్డారు. 

సుత్తి మాటలు ఆపాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ఏనాడు నోరు తెరిచి నిజం చెప్పలేదని విమర్శించారు. లోటస్ పాండ్ తనది కాదంటాడని, బెంగళూరు ప్యాలెస్ ఉన్నా అది తనది కాదంటాడని, కడపలో భారతి సిమ్మెంట్ ఫ్యాక్టరీ ఉన్నా అది కూడా తనది కాదంటాడని, ఇక పేపర్, టీవీ ఛానెల్ అవి కూడా తమవి కావని అబద్దాలు చెప్తాడని మండిపడ్డారు. 

గాలి జనార్థన్ రెడ్డి ఎవరో తనకి తెలిదంటారు అని , పులివెందుల కృష్ణ అంటే ఎవరో తెలియదంటారని ఏరోజు జగన్ వాస్తవాలు చెప్పరన్నారు. నో నిజం అదే జగనిజం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఏపీలో చంద్రబాబు పాలన అద్భుతమన్నారు. తెలంగాణలో కేసీఆర్ కూడా చెయ్యలేదని అంతకంటే ఎక్కువ అభివృద్ధి చంద్రబాబు చేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కి ఎన్ని సీట్లు గెలిపించారో ఏపీలో అంతకంటే ఎక్కువ సీట్లు చంద్రబాబు గెలుచుకుంటారని మంత్రి ఆదినారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బురదలో ఇరుక్కున్నావ్, నువ్వేం పొడుస్తావ్ : మేడాపై ఆదినారాయణరెడ్డి ఫైర్