అమరావతి: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి నిప్పులు చెరిగారు. పోతే పో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసిన మేడా పోతూపోతూ టీడీపీపై బురద జల్లుతున్నారని విరుచుకుపడ్డారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన మేడా మల్లికార్జునరెడ్డి బురదలో ఇరుక్కుంటావనే విషయం తెలియక వైసీపీలో చేరుతున్నారని విరుచుకుపడ్డారు. రాజంపేట నియోజకవర్గం ప్రజలు ఎవరు మేడా మల్లికార్జున రెడ్డి వెంట లేరన్నారు. 

అమరావతిలో సీఎం నివాసానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలను చూస్తే మేడా వెంట ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు. మేడా మల్లికార్జున రెడ్డితో ఎవరూ లేరన్నారు. త్వరలోనే ప్రజలు మేడా మల్లికార్జునరెడ్డికి తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. 

చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఏంటో వైఎస్ జగన్ క్యారెక్టర్ ఏంటో ప్రజలకు అంతా తెలుసునన్నారు. రాజకీయాల్లో వాస్తవాలు అనేవి నెమ్మదిగా తెలుస్తాయని మేడా ను మంత్రి ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ పప్పులు ఉడకవన్న ఆయన మరి మేడా ఏం పొడుస్తావ్ అంటూ విరుచుకుపడ్డారు. త్వరలోనే జగన్ యిజం ఏంటో తెలుస్తుందని మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.