విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల కార్లపై ఎయిర్‌పోర్ట్ వద్ద జనసేన కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్.  విశాఖ గర్జన రోజే పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులు రోజా, జోగి రమేష్ , టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిలపై జరిగిన దాడిని ఖండించారు ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజా స్వామ్యంలో దాడులు మంచివి కావన్నారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సౌమ్యుడని ఆయనపై దాడి హేయమైన చర్యగా సురేశ్ అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ మాటతీరు వల్లే దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడుల వెనుక జనసేన నేతల ప్రణాళిక ఉందనిపిస్తుందని ఆదిమూలపు అనుమానం వ్యక్తం చేశారు. ఉద్దేశ పూర్వకంగానే జనసేన దాడులు నిర్వహించింది మంత్రి ఆరోపించారు

తాము దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే జనసేన నేతలు తిరగగలరా అని ఆయన ప్రశ్నించారు. విశాఖ గర్జన విజయవంతం అయిందన్నారు. జనసేన నేతల దాడులతో విశాఖ పరిపాలన రాజధాని కాకుండా అడ్డుకోలేరని ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరికో పల్లకి మోయడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. విశాఖ గర్జన రోజే పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ పెట్టుకున్నారని... శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే ఊరుకునేది లేదని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. దాడులు చేసిన వారిపై పోలీస్ చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. 

Also Read:లీడర్‌ను బట్టే కేడర్ ... వాళ్లు జనసైనికులు కాదు, జనసైకోలు : విశాఖ దాడి ఘటనపై గుడివాడ ఆగ్రహం

అంతకుముందు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా దాడి ఘటనను ఖండించారు. ఈ ఘటనకు పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని గుడివాడ కోరారు. వాళ్లు జనసైనికులు కాదని.. జనసైనికులంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లీడర్‌ను బట్టి కేడర్ ప్రవర్తన వుంటుందని.. ఇది ఉద్యమంపై చేసిన దాడి అని గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. 

ఇంట్లోనే సర్దుకోలేని పవన్ ప్రజలతో ఎలా అడ్జస్ట్ అవుతారని అమర్‌నాథ్ ప్రశ్నించారు. జనసేన నడిచేదే నాదెండ్ల డైరెక్షన్లో, చంద్రబాబు ప్రొడక్షన్‌లో అని ఆయన సెటైర్లు వేశారు. నాదెండ్ల శిఖండి వ్యవహారాలు మానుకోవాలని అమర్‌నాథ్ హితవు పలికారు. టీడీపీ... దాని మిత్రపక్షంగా జనసేన వున్నప్పుడే కోడి కత్తి సంఘటన జరిగిందని ఆయన గుర్తుచేశారు. కోడి కత్తితో ఎవరు దాడి చేశారో పట్టుకున్నారని.. ఈ అంశంపై విచారణ జరుగుతోందని అమర్‌నాథ్ పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే:

వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్ ఇతర వైసీపీ నేతలు విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వాహనాలపై కర్రలు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు.