ఫిరాయింపుల్లో అత్యంత వివాదాస్పద మంత్రి ఆది నారాయణ రెడ్డే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన మాట కావచ్చు, చేత కావచ్చు నిత్యం వివాదాల్లోనే ఉంటున్నారు. ఆదినారాయణ రెడ్డి మంత్రైన దగ్గర నుండి అవినీతి ఆరోపణలకు కొదవే లేదు. తాజాగా కార్యకర్తలు సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయనపై వినిపిస్తున్న ఆరోపణలకు మరింత ఊతమిస్తోంది.

కడప జిల్లాలోని తన నియోజకవర్గం జమ్మలమడుగులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి చంద్రబాబే అవినీతి చేసుకోమని చెప్పాడు’ అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అంతటి ఆగితే ఆయన ఆదినారాయణరెడ్డి ఎందుకవుతారు? ‘ఆయన అడిగినదాంట్లో మనకు సగం వస్తాది’..‘మనం అడిగినా ఆయనకు సగం వస్తాది’ అంటూ వాటాల గుట్టు విప్పారు.

‘నేను చేసే ప్రతీ రూపాయి అవినీతిలో అర్థరూపాయి భాగం రామసుబ్బారెడ్డికి కూడా భాగం ఉంది’ అంటూ పెద్ద బాంబే పేల్చారు. ఎందుకంటే, మంత్రికి, రామసుబ్బారెడ్డికి ఉప్పు నిప్పు అన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా ‘స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు ఐఏఏస్ ఆఫీసర్లని మాతో పాటు కూర్చోబెట్టి పంచాయతీ చేసారు’ అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీలోనే కాకుండా జిల్లాలో కూడా పెద్ద దుమారమే రేపుతోంది.