ఆర్ధిక నిపుణులకు కూడా తెలియని కిటుకులేవో లోకేష్ కు తెలిసి వుండాలి. లేకపోతే ఐదు నెలల్లో లోకేష్ ఆస్తుల విలువ 23 రెట్లు ఎలా పెరుగుతాయి?
తెలుగుదేశం పార్టీ యువరాజు నారా లోకేష్ యమ ఫాస్ట్. రాజకీయంలోనే కాదు, హెరిటేజ్ సంస్ధను నడపటంలో కాదు. ఆస్తులను కూడబెట్టటంలోనూ వాటి విలువను పెంచుకోవటంలో కూడా తనకు తానే సాటి అని అనిపించుకున్నారు. ఆర్ధిక నిపుణులకు కూడా తెలియని కిటుకులేవో లోకేష్ కు తెలిసి వుండాలి. లేకపోతే ఐదు నెలల్లో లోకేష్ ఆస్తుల విలువ 23 రెట్లు ఎలా పెరుగుతాయి? తాజాగా ఎన్నికల కమీషన్ కు అందచేసిన అఫిడవిట్ ను చూసిన వారి మతిపోతోంది. ఎంఎల్సీగా నామినేషన్ వేసిన లోకేష్ అఫిడవిట్ కూడా దాఖలు చేసారు. దాని ప్రకారం తన ఆస్తుల విలువ సుమారు రూ. 300 కోట్లుగా చెప్పారు. అయితే, పోయిన ఏడాదిలో ప్రకటించిన అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ. 14.50 కోట్లేనని చెప్పటం గమనార్హం.
అంటే ఐదు మాసాల్లో ఒక్కసారిగా లోకేష్ ఆస్తుల విలువ రూ. 14.50 కోట్ల నుండి రూ. 300 కోట్లకు పెరిగింది. ఈ విషయమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఇపుడు. ఇంత వేగంగా లోకేష్ ఆస్తులు ఎలా పెరిగాయో ఎవరికీ అర్ధం కావటం లేదు. దేశం మొత్తం మీద స్వచ్చంధంగా ఆస్తులను ప్రకటించే రాజకీయ కుటుంబం తమదేనని చెప్పుకుంటూంటారు తండ్రి, కొడుకులు. మరి అదే పద్దతిలో ఐదు నెలల్లో ఆస్తుల విలువ పెరగటానికి కారణాలు కూడా నిప్పు చంద్రబాబునాయుడు వారసుడు చెబితే బాగుంటుంది కదా? తనతో పాటు తన భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువను కూడా లోకేష్ వెల్లడించారు. ప్రస్తుత ఆస్తుల విలువ రూ. 28 కోట్లు కాగా పోయిన అక్టోబర్ లో వెల్లడించిన ఆస్తుల విలువ రూ. 5.38 కోట్లే.
