మృతుడి ఆధార్, ఓటరు కార్డు ఆధారంగా మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌కు చెందిన పురన్ చెట్రి కుమారుడు సంజీవ్ చెట్రి (38)గా గుర్తించారు.
వాటర్ ట్యాంకులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. ఇంటి పైకప్పుపై ఉన్న ట్యాంకు నుంచి నీరు సరఫరా కాకపోవడంతో అనుమానం వచ్చి ట్యాంకు పరిశీలిస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కుప్పం పట్టణంలోని శాస్త్రివీధిలోని సర్దార్ బాషా ఇంట్లో కాపురం ఉంటున్న కుటుంబ సభ్యులు కుళాయిల్లో నీరు రాకపోవడంతో అనుమానం వచ్చి ట్యాంకును పరిశీలించి చూస్తే వ్యక్తి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ రాఘవన్, ఎస్సై ప్రవీణ్ ట్యాంకులోని మృతదేహాన్ని వెలికి తీయించి పరిశీలించారు.
మృతుడి ఆధార్, ఓటరు కార్డు ఆధారంగా మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌కు చెందిన పురన్ చెట్రి కుమారుడు సంజీవ్ చెట్రి (38)గా గుర్తించారు. మృతుడి వద్ద బుధవారం ఉదయం 11.23 గంటలకు జోలార్‌పేట నుంచి బెంగళూరుకు వెళ్లే రైల్వే టిక్కెట్ లభ్యమైంది. మార్గమధ్యంలో కుప్పంలో దిగి ఉంటాడని అనుమానిస్తున్నారు.
మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం... ఇక్కడ ఎవరికీ అతను పరిచయం లేకపోవడం.. తెలియని వారి ఇంటి మిద్దెపైకి ఎలా వచ్చాడన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దొంగతనానికి వచ్చి ఎవరైనా చూస్తారేమోనని అనుమానంతో దాక్కునేందుకు ట్యాంకులోకి దిగి ఉంటాడని అనుమానిస్తున్నారు.
ఇదే వ్యక్తి బుధవారం రాత్రి మద్యం తాగి అనుమానాస్పదంగా బీట్ కానిస్టేబుల్స్‌కు రైల్వేస్టేషన్ వద్ద కంటపడగా విచారించారు. తాను ఐస్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు వెళుతున్నానని, తన తోటివారు విడిచి వెళ్లిపోయారని, తిరిగి వెళ్లేందుకు డబ్బులు లేవని చెప్పడంతో విడిచి పెట్టినట్లు తెలిసింది. మృతుడి వద్ద ఉన్న ఫోన్ నెంబరు ఆధారంగా అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారాన్ని అందించారు. శవపరీక్షకు ఏరియా ఆస్పత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jul 13, 2018, 10:07 AM IST