మెగా బ్రదర్ నాగబాబు మరో వీడియో విడుదల చేశారు. ఇప్పటి వరకు చంద్రబాబు, జగన్, లోకేష్ లను టార్గెట్ చేస్తూ.. వీడియోలు విడుదల చేసిన నాగబాబు తొలిసారి తన తమ్ముడు పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ జనసేనకు మద్దతుగా వీడియో విడుదల చేశారు.

గ్లాసే( జనసేన పార్టీ గుర్తు) కదా అని పగలగొట్లాని చూస్తే.. పీక కోస్తది అని నాగబాబు హెచ్చరించారు. జనసేనను తొక్కేయాలని, జనసైనికులను మానసికంగా కుంగదీయాలని నీచమైన ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వాళ్లే.. పవన్ వైసీపీతో కలిసిపోయారంటున్నారని.. వైసీపీ వాళ్లేమో.. పవన్, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారని మధ్యలో బీజేపీతో కూడా కలిసిపోయాడని కామెంట్స్ చేస్తున్నరన్నారు.

కళ్యాణ్ బాబు అంత ఓపెన్ గా చెప్పినా కొంచెం కూడా సెన్స్ లేదా అని ప్రశ్నించారు. పవన్.. మీ లాగా కన్వెన్షనల్,క్రిమినల్, ఫ్యాక్షన్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా చేసే వ్యక్తి కాదంటూ టీడీపీ, వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒక జెన్యూన్ ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలని జనంలో నుంచి వస్తున్న వ్యక్తి పవన్ అని కొణియాడారు.

ఎంత తొక్కాలని చూసినా.. పవన్ అంత ఎత్తుకు ఎదుగుతారన్నారు.  ఎంత నిజానికి దిగజారినా.. జనం గుండెల్లో ఉన్న జనసేన, పవన్ ని ఏం చేయలేరన్నారు. గాజు గ్లాసు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని నాగబాబు అన్నారు. దాహం వేస్తే అందులో నీరు పోసుకొని దాహం తీర్చుకోవచ్చు అని ఆయన అన్నారు.

ఆ గ్లాసుని కాపాడుకోవడం మన ధర్మమని ఆయన అన్నారు. గ్లాసుకి తన పర, మంచి, చెడు బేధం చూపించదన్నారు. ఇతడు ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా గాజు గ్లాసుకు లేదన్నారు. గాజు గ్లాసు పగలకొట్టాలని చూస్తే.. దాని పెంకు ఆయుధంగా మారి.. పీకలు కోస్తది జాగ్రత్త అని హెచ్చరించారు. పూర్తి వీడియో ఈ కింద చూడండి